గ్రేహౌండ్స్కు అత్యాధునిక డ్రోన్లు.. కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా పోలీస్‌‌ శాఖ

గ్రేహౌండ్స్కు అత్యాధునిక డ్రోన్లు.. కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా పోలీస్‌‌ శాఖ
  • డిసెంబర్‌‌ 7 వరకు టెండర్ల స్వీకరణ 

హైదరాబాద్‌‌, వెలుగు: మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించిన గ్రేహౌండ్స్‌‌ బలగాలను సాంకేతికంగా మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర పోలీస్‌‌ శాఖ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో నిఘా, సమాచార సేకరణ, కమ్యూనికేషన్‌‌ వ్యవస్థను మెరుగుపర్చే లక్ష్యంతో అధునాతన డ్రోన్లతో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ ఆపరేషన్స్‌‌, గ్రేహౌండ్స్‌‌ కార్యాలయం డ్రోన్ల కొనుగోలు కోసం ఇటీవల టెండర్‌‌ నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. 

టెండర్ల దాఖలుకు డిసెంబర్‌‌ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. డిసెంబర్‌‌ 8న ప్రీ క్వాలిఫికేషన్‌‌ బిడ్లు, 10న సాంకేతిక బిడ్లు, 14న ధరల బిడ్లు తెరవనున్నారు. టెండర్‌‌ విధానంలో కొనుగోలు చేయనున్న డ్రోన్లు గరిష్టంగా 5 కిలోమీటర్ల పరిధిలో పనిచేయాలి. భూమికి 1,000 మీటర్ల ఎత్తులో ఎగిరే సామర్థ్యంతో పాటు సముద్ర మట్టానికి 4,000 మీటర్ల ఎత్తు వరకు పనిచేయగలగాలి. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్‌‌ పెడితే కనీసం 30 నిమిషాల పాటు గాల్లోనే ఎగరగలగాలి.