మేం ఆదేశిస్తేనే కేసులు నమోదు చేస్తారా?.. బిచ్కుంద పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

మేం ఆదేశిస్తేనే కేసులు నమోదు చేస్తారా?..  బిచ్కుంద పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కామారెడ్డి జిల్లా  బిచ్కుంద పోలీసుల తీరుపై హైకోర్టు మండిపడింది.ఫిర్యాదు అందినప్పుడు చట్టప్రకారం స్పందించాల్సిన పోలీసులు.. బాధితులు కోర్టును ఆశ్రయించిన తర్వాత చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. కేసు దర్యాప్తును మరో అధికారికి అప్పగించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీని ఆదేశించింది. బిచ్కుందలో రోడ్డు  తవ్వకాల విషయంలో తలెత్తిన వివాదంలో స్థానిక కౌన్సిలర్‌‌ మహ్మద్‌‌ ముజాహీద్‌‌, ఆయన అనుచరులు అక్టోబరు 25న తనపై దాడి చేశారని వహీదాబీ అక్టోబరు 26న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. 

పిటిషన్ ను జస్టిస్‌‌ టి.మాధవీదేవి విచారించారు. పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది వాదిస్తు.. హైకోర్టు నోటీసులు జారీ చేసి ఎస్సైని హాజరుకావాలని ఆదేశించిన తర్వాత ఎఫ్ఐఆర్‌‌ నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది మహేష్‌‌ రాజె స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్‌‌లో తేదీ తప్పుగా నమోదైందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఫిర్యాదు జాప్యానికి బాధ్యులపై తీసుకున్న చర్యల వివరాలతో డిసెంబరు 24లోగా నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించారు. కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు.