మంచిర్యాల, వెలుగు: దేశంలోని ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం జెన్‌జీ తరహా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరముందని సీపీఎం జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ పిలుపునిచ్చారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ఆదివాసీ గిరిజన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీలను ప్రధాని మోదీ ‘వనవాసీ’ అని పిలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని ఆదివాసీలుగా గుర్తిస్తే హక్కులకు బాధ్యత వహించాల్సి వస్తుందనే భయంతోనే ‘వనవాసీ’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు.
ఆదివాసీల అస్తిత్వాన్ని, హక్కులను దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలు పులుల సంరక్షణ పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయిస్తున్నాయని ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పులులు అడ్డురాకపోవడం, ఆదివాసీల పోడు సాగుకు మాత్రం అడ్డంకులు సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. ఫారెస్టు అధికారులతో ఆదివాసీలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, ప్రజాపాలన అంటే ఇదేనా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
అటవీ హక్కుల చట్టం ప్రకారం గత 20 ఏండ్లలో 13 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయాల్సి ఉండగా, 4 లక్షల ఎకరాలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన 8లక్షల ఎకరాల భూమి ఏమైందో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జల్, జంగల్, జమీన్‌ను అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జన గణనలో మతాల వారిగా వివరాలు సేకరిస్తూ ఆదివాసీల అస్తిత్వాన్ని, హక్కులను కాలరాసే కుట్రలో భాగంగానే ఆదివాసీలకు ప్రత్యేక కాలమ్ కల్పించలేదన్నారు. ఆదివాసీ పోరాటయోధుడు కుమ్రం భీమ్ స్ఫూర్తితో ఆదివాసీ యువత జల్, జంగల్, జమీన్ కోసం పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగజ్‌నగర్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
