ఆదిలాబాద్: బినామీ అకౌంట్లతో ఇన్ కమ్ టాక్స్ ఎగవేత

ఆదిలాబాద్: బినామీ అకౌంట్లతో ఇన్ కమ్ టాక్స్ ఎగవేత
  • ఫ్యాక్టరీల్లోని కార్మికుల పేర్లపై కోట్లది రూపాయల లావాదేవీలు
  • ఆదిలాబాద్​లో బడా వ్యాపారవేత్త అరెస్ట్
  • కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: తమ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల పేర్లపై బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచి, కోట్లాది రూపాయల లావాదేవీలు నిర్వహిస్తూ ఇన్​కమ్​టాక్స్​ఎగవేతకు పాల్పడిన ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన బడా వ్యాపారవేత్తను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ మిట్టల్ అలియాస్ రాజీవ్ కుమార్ మిట్టల్ అలియాస్ గోరే సేఠ్, తన సోదరుడు సంజీవ్ కుమార్ మిట్టల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ మోసానికి పాల్పడ్డాడు. 

కార్మికులైన పెర్క భూమన్న, అలువాల అనిల్ కుమార్, సుధాకర్, మాదస్తువార్ సంతోష్, రమాకాంత్ కేంద్రే, గోదం గజానన్ తదితరులను నమ్మించి వారి ఆధార్, పాన్ కార్డులు సేకరించారు. ఖాళీ కాగితాలపై వారి సంతకాలు తీసుకుని ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోని ‘శ్రీ రేణుకా మాత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌’లో వారి పేర్లపై ఖాతాలు తెరిచారు. అనంతరం ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని, ఆ ఖాతాల ద్వారా తమ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్ను ఎగవేశారు. 

నాలుగేండ్ల కింద ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా పన్ను బకాయిలు చెల్లిస్తామని నిందితులు హామీ ఇచ్చి కాలయాపన చేశారు. దీంతో 2022 జులై 29న ఆదాయపు పన్ను శాఖ నుంచి కార్మికులకు నోటీసులు అందడంతో ఈ మోసం బయటపడింది. కార్మికుల ఖాతాల్లో రూ.8.55 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో బాధితుడు పెర్క భూమన్న సొంత బ్యాంకు ఖాతా కూడా ఫ్రీజ్ కావడంతో, తన ఖాతాలోని నగదును వాడుకోలేక ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మిట్టల్‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించగా, పరారీలో ఉన్న మరో నిందితుడు సంజీవ్ కుమార్ మిట్టల్ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ పాల్గొన్నారు.