- ఇచ్చంపల్లి నుంచి వద్దన్న ఏపీ.. చత్తీస్‌గఢ్ అనుమతి ఉండాలని వ్యాఖ్య
- అఘనాశిని వేదావతి ఇంట్రా లింక్ చేపట్టాలంటూ కర్నాటక కొత్త వాదన
- లింక్‌లో ఉన్న రాష్ట్రాలతో విడివిడిగా మీటింగ్స్ పెట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్ ఆదేశాలు
- 77వ గవర్నింగ్ బాడీ మీటింగ్ మినిట్స్ విడుదల
హైదరాబాద్, వెలుగు: గోదావరి కావేరి లింక్ సహా పలు నదుల అనుసంధాన ప్రాజెక్టులపై సంబంధిత రాష్ట్రాలతో విడివిడిగా సమావేశాలను నిర్వహించాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చైర్మన్, కేంద్రజలశక్తి శాఖ సెక్రటరీ ఆదేశించారు.
ఈ నెల 3న జరిగిన ఎన్‌డబ్ల్యూడీఏ 77వ గవర్నింగ్ బాడీ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. దీని ప్రకారం.. జీసీ లింక్‌లో భాగమైన తెలంగాణ, ఏపీ, కర్నాటక, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో ఒక్కొక్క రాష్ట్రంతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులకు సూచించారు. ఈ మీటింగ్‌లోనే ఇంద్రావతి సబ్ బేసిన్ నుంచి నీటిని తరలించడంపై ఏపీ తిరకాసు పెట్టింది. వినియోగంలో లేవని చెబుతున్న ఆ నీటిని జీసీ లింక్‌కు ఎలా తరలిస్తారని పేర్కొంది.
ఇంద్రావతిలో భాగమైన చత్తీస్‌గఢ్ అందుకు ఒప్పుకోవాలంటూ వ్యాఖ్యానించింది. ఇచ్చంపల్లి నుంచి సోర్సును తీసేసి పోలవరం/బనకచర్ల లింక్‌ను అనుసంధానించి నీటిని తరలించాలని డిమాండ్ చేసింది. తద్వారా తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టాలని ఏపీ భావిస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం నుంచి ఒప్పుకునేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది.
గోదావరి–కావేరి లింక్‌కు కొన్ని షరతులతో కూడిన సూత్రప్రాయ అంగీకారం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. నీటి తరలింపు (డ్రాల్) పాయింట్‌ను ఇచ్చంపల్లి నుంచి పోలవరానికి మార్చాలన్న ఏపీ సూచన తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అలా చేస్తే బ్యాక్ వాటర్స్ తో తెలంగాణలోని ప్రాంతాలు మునిగిపోతాయని పేర్కొంది. ఆల్మట్టి నుంచి రిప్లేస్మెంట్ పద్ధతిలో కర్నాటకకు జీ–సీ లింక్ నీటిలో 16 టీఎంసీలు కేటాయించాలన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరింది. దీనివల్ల తమ జూరాల ప్రాజెక్టుకు వచ్చే నీటి ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆల్మట్టి వద్ద కర్నాటక నీటిని తీసుకునే విధానంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. కృష్ణా బేసిన్లో తమ రాష్ట్ర పరిధిలో పెద్ద ఎత్తున కరువు పీడిత ప్రాంతాలు ఉన్నందున, తమకు మరిన్ని నీటి కేటాయింపులు చేయాలని కోరింది. బేడ్తి–హిరేవడ్డతి లింక్ ద్వారా కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరుగుతున్నందున, ఆ అదనపు జలాల్లో తెలంగాణకు వాటా ఇవ్వాలని స్పష్టం చేసింది.
వాటర్ బ్యాలెన్స్ వివరాలివ్వండి
బేడ్తి-హిరేవడ్డతి లింక్‌ను చేపడితే.. దిగువన జలాలు తగ్గిపోతాయని ఏపీ పేర్కొంది. ముందుగా దానికి సంబంధించి కృష్ణాలో నీటి లభ్యత లెక్కల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక, ఇటు కర్నాటక కూడా కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
ఇంట్రాలింక్లో భాగంగా ఇప్పటికే బేడ్తి-హిరేవడ్డతి చేపడుతుండగా.. ఆల్మట్టి పెన్నా లింక్ డీపీఆర్‌పై ఆ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ లింక్ ద్వారా లభించే మొత్తం 15.9 టీఎంసీల నీటినీ కర్నాటకనే వాడుకునేలా అనుమతించాలని డిమాండ్ చేసింది. అలాగే, ఎత్తినహోళె ప్రాజెక్టు చేపట్టినందున నేత్రావతి–హేమావతి లింక్ స్థానంలో ‘అఘనాశిని–వేదావతి’ ఇంట్రా స్టేట్ లింక్‌ను జాతీయ ప్రణాళిక (ఎన్పీపీ)లో చేర్చాలని కోరింది.
ఎందుకంత లేట్
ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీ, అమలు తీరుపై ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీఆర్‌లు ఎందుకు లేట్ అవుతున్నాయని ప్రశ్నించారు. చాలా ప్రాజెక్టులు ఆలస్యమవుతుండటంతో అసలైన లబ్ధిదారులకు సకాలంలో ఫలాలు అందడం లేదని, ప్రాథమిక కసరత్తు సరిగ్గా ఉంటేనే ప్రాజెక్టులు ముందుకు పడతాయన్నారు.
30 ఏండ్ల వర్షపాతం ఆధారంగా స్టడీ
అన్ని బేసిన్లలో 30 ఏండ్ల వర్షపాతం డేటా ఆధారంగా నీటి లభ్యత (వాటర్ బ్యాలెన్స్)ను స్టడీ చేస్తున్నామని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ప్రవాహ డేటా ఆధారంగా ఉపరితల జలాలనే లెక్కలోకి తీసుకుంటామన్నారు. అయితే, ఆ డేటాను ప్రతి పదేండ్లకోసారి రివ్యూ చేసి మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు.
కాగా, ఎన్పీపీ కింద 30 నదుల అనుసంధాన ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు 15 డీపీఆర్‌లు, 26 ఫీజిబిలిటీ రిపోర్టులు (ఎఫ్ఆర్), 30 ప్రీ–ఫీజిబిలిటీ రిపోర్టులు (పీఎఫ్ఆర్), 137 వాటర్ బ్యాలెన్స్ స్టడీలు పూర్తయ్యాయని డీజీ తెలిపారు. అలాగే బేడ్తి–హిరేవడ్డతి లింక్‌ను కూడా ఎన్పీపీ ప్రాధాన్యత జాబితాలో చేర్చాలని జాయింట్ సెక్రటరీ (పీపీ) సూచించారు.
