అలుగునూర్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫ్లెక్సీ ఫ్లైట్

అలుగునూర్ లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫ్లెక్సీ ఫ్లైట్
  •     బీఆర్​ఎస్​ లీడర్ల తీరును నిరసిస్తూ కాంగ్రెస్​ నాయకుల ఆందోళన
  •     పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం 

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్​లోని 8వ డివిజన్ అలుగునూర్​లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్​ఎస్​ నేతల మధ్య శనివారం ఫ్లెక్సీ వార్​ జరిగింది. ఇటీవల కాంగ్రెస్​ డివిజన్​ ప్రెసిడెంట్​గా ఎన్నికైన కంది అశోక్​ రెడ్డి తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి స్మరించుకుంటూ అలుగునూర్​ చౌరస్తాలోని ఓ హోర్డింగ్​పై ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈనెల 29న బీఆర్​ఎస్​ దీక్షా దివస్​ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో డివిజన్ ప్రెసిడెంట్​ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై బీఆర్​ఎస్​ నాయకులు తమ ఫ్లెక్సీని కట్టారు. 

దీంతో కాంగ్రెస్​ నాయకులు తమ ఫ్లెక్సీపై బీఆర్​ఎస్​ నాయకులు ఎలా కడతారంటూ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మండల బీఆర్​ఎస్​ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు  కూడా తొలగించాలంటూ కాంగ్రెస్​ నాయకులు పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని నాయకులకు నచ్చజెప్పారు. అనంతరం ఫ్లెక్సీలను తొలగించి, వారిని అక్కడ నుంచి పంపారు.