సాధారణ పిటిషన్లకు ఆఫ్‌లైన్ విధానంలో అనుమతివ్వాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాయంత్రం కోర్టుల నిర్వహణకు సంబంధించి ప్రతిపాదించిన విధానాన్ని అమలు చేయొద్దని తెలంగాణ బార్ అసోసియేషన్ల సమాఖ్య కోరింది. ఈ నిర్ణయం వల్ల న్యాయవాదుల వృత్తిపరమైన కార్యకలాపాలకు ఆటంకం కలగడంతో పాటు పలువర్గాల వారు ఇబ్బందులు పడతారని పేర్కొంది. ఈ మేరకు సమాఖ్య ప్రతినిధులు శనివారం హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమాఖ్య అధ్యక్షుడు గోలి విప్లవ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల బార్ అసోసియేషన్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయన్నారు.
సాధారణ కోర్టు వేళల్లోనే కేసుల విచారణ, పిటిషన్ల తయారీ, కక్షిదారులతో సంప్రదింపులు, ఇతర వృత్తిపరమైన పనులు ఉంటాయని వివరించారు. సాయంత్రం కూడా కోర్టులు నిర్వహిస్తే న్యాయవాదులపై పని ఒత్తిడి పెరుగుతుందని, ముఖ్యంగా మహిళా న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు, కుటుంబ బాధ్యతలు నిర్వహించే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. కోర్టుల పనివేళలకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు బార్ అసోసియేషన్లతో సంప్రదించాలని కోరారు.
ఈ-ఫైలింగ్ నిబంధన సడలించాలి
సాధారణ పిటిషన్ల విషయంలో తప్పనిసరి ఈ-ఫైలింగ్ నిబంధనను సడలించి భౌతికంగా దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. నిందితుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు, గైర్హాజరు, సాధారణ వాయిదాలు, చిన్నపాటి మధ్యంతర దరఖాస్తులను నేరుగా కోర్టుల్లో సమర్పించేందుకు అనుమతించాలని కోరింది. అత్యవసర సందర్భాల్లో ఆన్‌లైన్ దాఖలు ప్రక్రియ వల్ల న్యాయవాదులు, కక్షిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. డిజిటలైజేషన్‌కు తాము వ్యతిరేకం కాదని, న్యాయవాదులు, కక్షిదారులకు ఇబ్బందులు కలగకుండా విధానాలను రూపొందించాలని విజ్ఞప్తి చేసింది. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో మరుగుదొడ్లు, మహిళా న్యాయవాదుల కోసం సౌలతులు ఏర్పాటు చేయాలని కోరింది. అనంతరం బార్ కౌన్సిల్ చైర్మన్ సాముల రాంరెడ్డిని కలిసి మరో వినతిపత్రం అందజేశారు.
