- 120 మంది దరఖాస్తు చేసుకోగా 93 మంది హాజరు
- 18.33శాతానికే పరిమితమైన ఇన్వాలిడేషన్
- తొలిసారిగా రామగుండంలో మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు
కోల్బెల్ట్, వెలుగు :పెద్దపల్లి జిల్లా రామగుండం(గోదావరిఖని) ఏరియా ఆస్పత్రిలో సింగరేణి ఉద్యోగులకు తొలిసారి నిర్వహించిన మెడికల్ బోర్డు వైద్య పరీక్షలు శనివారం ముగిశాయి. రెండు రోజుల పాటు నిర్వహించిన మెడికల్‌బోర్డు వైద్య పరీక్షలకు 120 మంది కార్మికులు దరఖాస్తు చేసుకోగా, 93 మంది హాజరయ్యారు. కార్మికులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి 22 మంది విధులు నిర్వహించలేరంటూ ఇన్వాలిడేషన్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 27 మంది గైర్హాజరు కాగా, 46 మందిని ఫిట్‌ఫర్ జాబ్‌గా ప్రకటించింది.
21 మందిని అండర్గ్రౌండ్నుంచి సర్ఫేస్ విధులకు, మరో నలుగురిని హైయ్యర్ సెంటర్ వైద్య పరీక్షలకు రెఫర్చేసింది. కాగా, జులై నుంచి జరుగుతున్న మెడికల్బోర్డుల్లో ఈసారి రామగుండంలో జరిగిన బోర్డులో ఎక్కువ మంది కార్మికులు హాజరైనప్పటికీ ఇన్వాలిడేషన్ శాతం మాత్రం పెరగలేదు. ఇప్పటి వరకు కొత్తగూడెం సింగరేణి మొయిన్ఆస్పత్రిలో కొనసాగుతున్న మెడికల్ బోర్డు పరీక్షలు కార్మికుల సౌకర్యార్థం రామగుండంలోనూ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వైద్య పరీక్షలు, నివేదికల పరిశీలన పకడ్బందీగా 50సీసీ కెమెరాల నిఘాలో కొనసాగాయి. శనివారం రాత్రి మెడికల్‌బోర్డు తుదిఫలితాలను ప్రకటించింది.
పెరగని 'కారుణ్యం’..
రామగుండంలో తొలిసారిగా ఏరియా స్థాయిలో నిర్వహించిన మెడికల్ బోర్డులో హాజరైన కార్మికుల్లో కనీసం 60శాతానికి పైగా ఇన్వాలిడేషన్ చేస్తారని భావించారు.. కానీ, అది 18.33శాతానికే పరిమితమైంది. సింగరేణిలో క్రమేణా కారుణ్యం తగ్గుతుందని మరోసారి రుజువైంది. మరోవైపు సింగరేణిలో ఏడాదిన్నర కాలం నిలిపివేసిన మెడికల్బోర్డును జులై నుంచి నిర్వహిస్తున్నారు. ఈనెల 17,18 తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన హాస్పిటల్లో మెడికల్ బోర్డుకు 120 మంది హాజరుకాగా, 20 మంది(20శాతం)మాత్రమే ఇన్వాలిడేషన్ అయ్యారు.
ఈ మెడికల్ బోర్డుకు 49 మంది గైర్హాజరయ్యారు. ఆగస్టు 26,27 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డుకు 120 మంది కార్మికులు దరఖాస్తు చేసుకోగా, 71 మంది హాజరయ్యారు. ఇందులో 12 మందిని ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉందంటూ నిర్ధారించి ఇన్వాలిడేషన్ చేశారు. కేవలం 10శాతమే ఇన్వాలిడేషన్ చేయటం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి. సెప్టెంబర్‌లో 25,26 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డుకు 120 మంది దరఖాస్తు చేసుకోగా, 69 మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 15 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్ చేశారు.
