21 కేంద్రాల్లో శిక్షణ.. 1,400 మంది విద్యార్థులు
కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండో.. ఇలాంటి యుద్ధ విద్యలు మనకు బాగా తెలుసు. కానీ కేరళలో పుట్టిన ప్రాచీన యుద్ధకళ కలరిపయట్టు గురించి చాలామందికి తెలియదు. ఉక్కు కండరాలు, మెరుపు వేగంతో కదిలే అడుగులు, కత్తిసాము విన్యాసాలు, శరీరాన్ని విల్లులా వంచే సాహసాలు.. ఒకప్పుడు కేరళకే పరిమితమైన ఈ యుద్ధకళ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ సందడి చేస్తోంది. ఆత్మరక్షణతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రతను పెంచే ఈ విద్యపై పిల్లల నుంచి పెద్దల దాకా సిటీవాసులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సిటీలో 21 చోట్ల కలరిపయట్టు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి.
ప్రపంచంలోని ప్రాచీన యుద్ధవిద్యల్లో ఒకటిగా కలరిపయట్టు గుర్తింపు పొందింది. ఇందులో శరీరాన్ని చురుగ్గా, అనువుగా మార్చే వ్యాయామాలు, కర్రలతో యుద్ధ విన్యాసాలు, కత్తి, డాలు వంటి లోహ ఆయుధాలతో శిక్షణ, ఆయుధాలు లేకుండానే ప్రత్యర్థిని ఎదుర్కొనే ఆత్మరక్షణ పద్ధతులు ఉంటాయి. ఒకప్పుడు యుద్ధరంగంలో శత్రువులను ఎదుర్కొనేందుకు వాడిన ఈ విద్య ఇప్పుడు ఆరోగ్యం, ఆత్మరక్షణ, ఫిట్‌నెస్‌కు వేదికగా మారింది.
శరీరంలోని ప్రతి కండరానికి వ్యాయామం అందించే ఈ సాధనలో ఏకాగ్రత, సమతుల్యత, వేగం కీలకం. ముఖ్యంగా మహిళలు స్వీయరక్షణ కోసం ఈ కళను నేర్చుకుంటున్నారు. ‘వ్యక్తిత్వ వికాసంతో పాటు ఆత్మరక్షణ, ఫిట్నెస్, క్రమశిక్షణ పెంచడమే మా లక్ష్యం. బాలికలు, యువతులు ఇది నేర్చుకుంటే ఆత్మరక్షణలో ఆరితేరుతారు’ అని కలరి శిక్షకుడు భరత్ చెప్పారు. రోజూ ఉదయం లేదా సాయంత్రం గంటపాటు శిక్షణకు నెలకు రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను సిద్ధం చేసేందుకు ఇండియన్ కలరిపయట్టు ఫెడరేషన్, కలరిపయట్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఇటీవల సిటీలో ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు; ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సన్నాహాల్లో భాగంగా కూడా శిబిరం జరిగింది.
తాత కర్రసాము నుంచి కలరి దాకా..
కడప జిల్లా దువ్వూరుకు చెందిన డాక్టర్ బోగిరి వెంకట శివరామ్ తాత బోగిరి వెంకటయ్య కర్రసాములో పేరొందిన వ్యక్తి. చిన్నప్పుడే తాత దగ్గర కర్రసాము నేర్చుకున్న శివరామ్, వైద్యవిద్య చదివి అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్, ట్రాన్స్‌ప్లాంట్ ఐసీయూ కేర్ డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయినా కలరిపై మక్కువ వదలలేదు. కేరళలోని కోజికోడ్ జిల్లా వడకరలో మధు గురుక్కల్ దగ్గర ఏడాది పాటు శిక్షణ పొందారు. ఢిల్లీలో పీజీ వైద్యుడిగా పనిచేస్తూనే కలరి గురువు మురుగన్ పిళ్లై గురుక్కల్ దగ్గర వడక్కన్, తెక్కన్ శైలులతో పాటు కలరి మర్మ చికిత్సలోనూ శిక్షణ తీసుకున్నారు.
పగలు డాక్టర్.. సాయంత్రం ‘కలరి శివ’
ప్రస్తుతం సనత్‌నగర్‌లోని సెయింట్ థెరిసా హాస్పిటల్లో అనస్థీషియా, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న శివరామ్, కలరిపయట్టు ప్రధాన శిక్షకుడిగా, స్టంట్ పెర్ఫార్మర్గా, నటుడిగా ‘కలరి శివ’గా పేరొందారు. నిత్య చైతన్య కలరి తెలంగాణ చాప్టర్ సహ వ్యవస్థాపకుడిగా, కలరి ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సినిమాల్లో నటనతో పాటు ఫైట్, స్టంట్ కొరియోగ్రఫీలోనూ పాలుపంచుకుంటున్నారు. 2017లో అమీర్‌పేట, బంజారాహిల్స్, కుందన్‌బాగ్‌లో మొదలుపెట్టిన శిక్షణ కేంద్రాలను ఇప్పుడు 21కి విస్తరించారు.
అల్వాల్/కొంపల్లి, అమీర్‌పేట, బహదూర్‌పల్లి, బంజారాహిల్స్, బేగంపేట, చందానగర్, బీహెచ్ఈఎల్, దేవరయాంజాల్, సికింద్రాబాద్, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, మంచిరేవుల, మణికొండ, ఉప్పల్, సైనిక్‌పురి, సూర్యనగర్, తార్నాక, కుషాయిగూడ, వనస్థలిపురం, కొండాపూర్, కోకాపేటలో ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 1,400 మంది బాలబాలికలకు కలరి నేర్పిస్తున్నామని శివరామ్ చెప్పారు.
14 వేల మంది బాలికలకు..
2020లో పెద్దపల్లి జిల్లాలోని 210 సర్కారు బడులకు చెందిన 14 వేల మంది బాలికలకు కలరి శిక్షణ ఇచ్చామని శివరామ్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,012 మంది స్కూల్ పోలీస్ క్యాడెట్లకు, సైబర్ సెక్యూరిటీ పోలీసులు, షీ టీమ్ సభ్యులు, ఐటీ ఉద్యోగులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.
వార్మప్, శరీరాన్ని వంచే విన్యాసాలు, కిక్‌లు, జంప్స్, కర్రసాము, కత్తిసాము ఫిట్నెస్ను పెంచుతాయని చెప్పారు. కేవలం కత్తి, కర్ర తిప్పడమే కాదు.. శరీరాన్ని, మనసును నియంత్రించే అద్భుత సాధన కలరిపయట్టు. మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యానికి, ఆపద వేళ ఆత్మరక్షణకు ఈ ప్రాచీన కళను నేటి తరం మళ్లీ అందిపుచ్చుకుంటోంది. కాలం మారినా కలరికి ఆదరణ తగ్గడం లేదు!
