- ఇతర వైద్య విభాగాల తరహాలో ప్రత్యేక హెచ్ఓడీ ఏర్పాటుకు ఆరోగ్య శాఖ యోచన
- సీటీ స్కాన్, వెంటిలేటర్ల నుంచి ల్యాబ్, ఓటీ పరికరాల వరకు కొత్త విభాగం పరిధిలోకి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య పరికరాల నిర్వహణ, పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు ప్రత్యేక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తున్నది. ప్రస్తుతం ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ బాధ్యతలన్నీ హాస్పిటల్ సూపరింటెండెంట్ పరిధిలోనే ఉంటున్నాయి.
ఇతర పరిపాలన బాధ్యతల కారణంగా పరికరాలపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మెడిసిన్, సర్జరీ తదితర విభాగాల తరహాలోనే ఎక్విప్మెంట్ నిర్వహణకు ప్రత్యేక హెచ్ఓడీని నియమించాలని భావిస్తున్నది.
కొత్త విభాగం పరిధిలోకి వైద్య పరికరాల నిరంతర పర్యవేక్షణ, ముందస్తు నిర్వహణ, మరమ్మతులు, స్పేర్ పార్ట్స్ సరఫరా, సీఏఎంసీ అగ్రిమెంట్ల అమలు వంటి బాధ్యతలు రానున్నాయి. పరికరాల మరమ్మతుల్లో జాప్యం కారణంగా వైద్య పరీక్షలు, చికిత్సలకు ఆటంకం కలగకుండా చూడటంతోపాటు పేషెంట్లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీర్ల వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. హాస్పిటల్ స్థాయిలోనూ ప్రత్యేక హెచ్ఓడీ ఉంటే సమన్వయం, జవాబుదారీతనం పెరుగుతాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.
సీటీ స్కాన్ నుంచి సర్జికల్ పరికరాల దాకా..
కొత్తగా ఏర్పాటు చేసే ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి సీటీ స్కానర్ల నుంచి కింది స్థాయి వైద్య పరికరాల వరకు అన్నీ రానున్నాయి. ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, మామోగ్రామ్, సీ-ఆర్మ్ మెషిన్లతోపాటు ఐసీయూ వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లలోని సర్జికల్ పరికరాల నిర్వహణ బాధ్యతలు కూడా ఈ విభాగానికే అప్పగించే అవకాశముంది.
కాగా, జీజీహెచ్లలో ఎమ్మారై సేవలను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే నిర్ణయించింది. మహబూబ్నగర్ జీజీహెచ్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, దశలవారీగా అన్ని జీజీహెచ్లలో పేషెంట్లకు ఉచితంగా ఎమ్మారై సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నది. పీపీపీ విధానంలో నిర్వహించే ఎమ్మారై పరికరాలు మినహా మిగతా వైద్య పరికరాల పర్యవేక్షణ కొత్త హెచ్ఓడీ పరిధిలోకి రానుంది.
