- చేవెళ్లలో ఆయిల్‌పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగును విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సాగు విస్తరణతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.
శనివారం చేవెళ్లలో జరిగిన రాష్ట్ర ఆయిల్‌పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.37 లక్షల ఎకరాల్లో 92,504 మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని చెప్పారు.
2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 1.54 లక్షల ఎకరాల్లో 46,840 మంది రైతులు కొత్తగా ఈ పంట సాగు చేపట్టారని వెల్లడించారు. కొత్త తోటల ఏర్పాటు, నిర్వహణ, అంతర పంటల సాగు కోసం ఇప్పటివరకు 75,628 మంది రైతుల ఖాతాల్లో రూ.442.74 కోట్ల రాయితీలు జమ చేసినట్లు తెలిపారు.
ఎకరానికి రూ.46,250 చొప్పున సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఆయిల్‌పామ్ పంట 30 ఏళ్ల పాటు దిగుబడినిస్తూ రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక భరోసా కల్పిస్తుందని చెప్పారు. ఈ పంట ద్వారా ఎకరానికి రూ.2 లక్షల వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
