ఓబీసీ కాలమ్ చేర్చే వరకు.. జనగణన బహిష్కరణం: ఓబీసీ సమన్వయ కమిటీ అల్టిమేటం

ఓబీసీ కాలమ్ చేర్చే వరకు..  జనగణన బహిష్కరణం: ఓబీసీ సమన్వయ కమిటీ అల్టిమేటం
  •  ప్రత్యేక ఆప్షన్ పెట్టకపోతే డిసెంబర్​ 1 నుంచి దేశవ్యాప్త సహాయనిరాకరణ

    
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం చేపడుతోన్న దేశ వ్యాప్త కులగణన ప్రశ్నల జాబితాలో ఓబీసీ కాలమ్‌‌ను చేర్చేవరకు జనగణనను బహిష్కరిస్తున్నామని ఆలిండియా ఓబీసీ కులగణన సమన్వయ కమిటీ నేతలు ప్రకటించారు. డిసెంబర్‌‌ 1 నుంచి పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న జనగణన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ కాలమ్‌‌ చేర్చి కుల గణన చేపట్టాలన్నారు. లేనిపక్షంలో అదే రోజు నుంచి దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు. 

బీసీల జనాభా లెక్కలు తేలే వరకు పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.  శనివారం  ఆలిండియా ఓబీసీ కులగణన సమన్వయ కమిటీ నేతలు జి.కిరణ్‌‌కుమార్‌‌, ప్రొఫెసర్‌‌ సూరజ్‌‌మండల్‌‌ అధ్వర్యంలో ‘ఛలో రాం లీలా మైదాన్’ ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనకు ఎంపీలు విల్సన్‌‌, పప్పుయాదవ్‌‌, మద్దెల గురుమూర్తి, ప్రొఫెసర్‌‌ కంచె ఐలయ్య యాదవ్‌‌, యోగేంద్రయాదవ్‌‌, తెలంగాణకు చెందిన మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌‌, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌‌, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు, భారీ సంఖ్యలో బీసీలు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓబీసీ విద్యార్థులు ఈ మహాసభలో పాల్గొని మద్దతు తెలిపారు. 

‘కౌంట్‌‌ మీ రైట్‌‌’ డిక్లరేషన్ ఆమోదం

ఓబీసీ మహాసభలో ‘కౌంట్‌‌ మీ రైట్‌‌’ పేరుతో కీలక డిక్లరేషన్‌‌ను ఆమోదించారు. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమండ్ నేతలు చేశారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, అభివృద్థికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్‌‌ చేశారు. కులగణనకు మద్దతు ఇవ్వని పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.