పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్, ఆపరేషన్ సింధూర్ ఘటనల స్ఫూర్తితో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మిస్తున్నారు. అర్జున్ కెరీర్లో ఇది 175వ సినిమా. శనివారం అయోధ్య రామాలయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. తన భార్య నివేదితతో కలిసి అర్జున్ పాల్గొన్నారు.
రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ విజయ్ భార్గవ్ దీనికి స్క్రీన్‌ప్లే అందించారు. ఆయన సైనిక అనుభవమే ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలం. జాతీయ విపత్తుల సమయంలో సైనికుల కర్తవ్యం, త్యాగం వెనుక ఉన్న మానవ కోణాన్ని, వారి సంకల్ప బలాన్ని వాస్తవికతతో మరియు భావోద్వేగభరితంగా తెరకెక్కిస్తామని మేకర్స్ తెలిపారు. హిందీలో తెరకెక్కే ఈ చిత్రాన్ని తొమ్మిది భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది పంద్రాగస్టుకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
