కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో శనివారం సంభవించిన భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూల్ పక్కనే ఉన్న ఇంట్లో ఒక్కసారిగా పేలుడు జరగడంతో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 97 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం10 గంటలకు అందర్ సేర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
మైనింగ్ కార్మికుల ఇంట్లో నిల్వ ఉంచిన డైనమైట్ పేలడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కాగా, పేలుడు ధాటికి పక్కనే ఉన్న పాఠశాల భవనం తీవ్రంగా దెబ్బతింది. దీంతో తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు, సహాయక బృందాలు స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
