తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు సమావేశం కావడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం (నవంబర్ 28, 2026) నాడు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని మహేశ్ బాబు మర్యాదపూర్వకంగా కలవగా, ఇద్దరూ కాసేపు పలు అంశాలపై చర్చించుకున్నారు. కానీ ఈ సమావేశం వెనుక ఉన్న ప్రత్యేక కారణాలు మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు.
సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు:
సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్ బాబు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ మీటింగ్ పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇద్దరు ప్రముఖులు కలిస్తే ఆ క్షణం ప్రత్యేకంగా మారింది. ఒకరు లక్షలాది మంది మనసులను గెలుచుకున్న సూపర్‌స్టార్ కాగా, మరొకరు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రజా నాయకుడు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు పెడుతున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వారణాసి షూటింగ్ బిజీలో మహేశ్:
మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మహేశ్ రుద్ర అనే పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి– మహేశ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మూవీ టీమ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ కావడం వారణాసి మూవీకి సంబంధించినదా లేక ఇతర అంశాలపై జరిగిందా అనే ఆసక్తి అందరిలోనూ ఇంట్రెస్ట్ నెలకొంది.
