ఒక్క రోజు నో నాన్ వెజ్! మాంసరహిత దినోత్సవం ప్రత్యేకత ఇదే!

ఒక్క రోజు  నో నాన్ వెజ్! మాంసరహిత దినోత్సవం ప్రత్యేకత ఇదే!

మనిషి ఆకలి తీర్చుకోవడానికి మరో జీవి ప్రాణం తీయాల్సిందేనా? ఆహారపు అలవాట్లలో చిన్న మార్పుతో మూగజీవాల ప్రాణాలను కాపాడలేమా? ఈ ప్రశ్నలతోనే శాకాహార ఉద్యమాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన సాధువాస్వానీ మిషన్ టి.ఎల్.వాస్వానీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఏటా ఒక రోజు మాంసరహిత దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్‌‌లోనూ శాకాహారం, వీగన్ ఫుడ్, జంతుకారుణ్యంపై అవగాహన కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. 

గురుదేవ్ సాధు టి.ఎల్.వాస్వాని జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు  అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవం, జంతు హక్కుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. జీవకారుణ్యం, జంతుహింస నివారణ, శాకాహార జీవనవిధానంపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా వందలాది కేంద్రాలతోపాటు మహారాష్ట్రలోని పూణేలో ప్రధాన కార్యాలయం ఉన్న సాధువాస్వాని మిషన్ 1986 నుంచి హైదరాబాద్‌‌లోని మారేడుపల్లి కేంద్రంగా  ‘అన్ని రకాల హత్యలను ఆపి, కరుణ జ్వాలలను వ్యాపింపజేయండి’ అనే నినాదంతో పనిచేస్తోంది. ఒక్కరోజు మాంసరహితం... జీవులపై కరుణకు సంకేతమని నగరంలో సాధువాస్వానీ మిషన్ ప్రచారం చేస్తుంది. హైదరాబాద్‌‌లోని సాధువాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్, కేంద్రాల్లో అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవాన్ని నిర్వహించి, పూర్తిగా శాకాహార జీవన విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.

వన్ డే వెజ్ ప్రతిజ్ఞ 

అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవం  సందర్భంగా హైదరాబాద్​లోని సాధువాస్వానీ మిషన్ ప్రతినిధులు  ‘వన్ డే వెజ్ ప్లెడ్జ్’ చేపట్టారు.  సాధువాస్వాని మిషన్ వాలంటీర్లు అంకితభావంతో స్టాప్ ఆల్ కిల్లింగ్ కరుణా సందేశాన్ని నగరంలోకి తీసుకువెళ్లారు. రాయదుర్గం, అమీర్‌‌పేట్ మెట్రో స్టేషన్లు వంటి రద్దీ కేంద్రాలు, కార్పొరేట్ క్యాంపస్‌‌లు, కమ్యూనిటీ ప్రదేశాల్లో తమ ‘వన్ డే వెజ్ ప్లెడ్జ్’ కియోస్క్‌‌ల ద్వారా వేలాదిమంది ప్రయాణికులను చైతన్యపరుస్తున్నామని సాధువాస్వానీ మిషన్ ప్రతినిధి మంజూ భగ్తానీ చెప్పారు. కంప్యాషన్ కనెక్ట్ పోర్టల్ ద్వారా నెటిజన్ల ఆన్‌‌లైన్ ప్రతిజ్ఞలను కూడా  నమోదు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వన్ డే వెజ్ ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసే వారు కేవలం ఆహారపు అలవాటుకు మించినదని, ఇది అమాయక జంతువుల ప్రాణాలను కాపాడే ప్రేమ కార్యం అంటారు మంజూ భగ్తానీ. 

సామాజిక సేవా కార్యక్రమాలు 

సాధువాస్వాని మిషన్ హైదరాబాద్ బృందం సభ్యులు ఏడాది పొడవునా సేవా, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురుదేవుని 147వ జయంతి సందర్భంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, వీధి జంతువులు, పక్షులను సంరక్షించడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు. నిరుపేదల అభ్యున్నతికి దోహదపడే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టామని సాధువాస్వానీ మిషన్ చైర్ పర్సన్ డాక్టర్ హరీష్ మిర్ చందానీ చెప్పారు. హైదరాబాద్‌‌ శివార్లలోని కొంపల్లిలో ఉన్న సాధువాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్​లో ఉన్న 4వేల మందికి పైగా విద్యార్థులు హైదరాబాద్ మాంస రహిత దినోత్సవ వేడుకలను జరుపుకున్నామని  సమావేశాలు, అవగాహన యాత్రలు, వీధి నాటకాలు, సృజనాత్మక శాకాహార కార్యక్రమాల ద్వారా విద్యార్థులు  మీట్ లెస్ డే పై ప్రచారం చేస్తున్నారని హరీష్ మిర్ చందానీ వివరించారు.

స్టాప్ ఆల్ కిల్లింగ్ 

హైదరాబాద్ నగరంలో సాధువాస్వానీ మిషన్ ప్రతినిధులు స్టాప్ ఆల్ కిల్లింగ్  పేరిట మాంసరహిత దినోత్సవం, జంతు హక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. కరుణ, అహింస, సకల జీవుల పట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తూ ఒక రోజు హింసాత్మక ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని ప్రజలను కోరుతుంద. మాంసాహారం కంటే శాకాహారం మంచిదంటూ ప్రచారం చేయడంతోపాటు  జీవహింస వద్దు... శాకాహారమే ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నామని  సాధువాస్వానీ మిషన్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ హీరా రూపానీ చెప్పారు.