హైదరాబాద్ మహానగరంలో నింగిని తాకే ఆకాశహర్మ్యాలు.. వాటి కింద గుక్కెడు నీటి కోసం 600 నుంచి 700 అడుగుల లోతు బోర్లు.. అయినా చుక్క నీరు దొరకని దుస్థితి. కానీ అదే నగరంలో, మూసీ తీరాన కేవలం 40 నుంచి 45 అడుగుల లోతున్న ఓ పురాతన మెట్ల బావి మాత్రం నిండుగా కళకళలాడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎంత లోతుకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. భూగర్భ జలాలు అడుగంటుతున్న ఈ సంక్షోభ వేళ.. మన పూర్వీకుల జల ఇంజినీరింగ్ ప్రతిభకు మెట్ల బావులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వీటిని కేవలం వారసత్వ చిహ్నాలుగా వదిలేయకుండా ప్రజల దాహం తీర్చే జలవనరులుగా తీర్చిదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 600కు పైగా మెట్ల బావులు ఉండగా, వాటిలో 350 నుంచి 400 బావులు ఆదరణ లేక శిథిలావస్థకు చేరాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 160కి పైగా మెట్ల బావులు ఉండగా, ఇప్పటివరకు 25 బావులనే పునరుద్ధరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో పునరుద్ధరణకు అనువైన 150కి పైగా బావులు ఉండగా, వాటిలో దాదాపు 90 శాతం నిర్లక్ష్యానికి గురయ్యాయని నిపుణుల పరిశీలనలో తేలింది. ఒక్కో మెట్ల బావి దాని పరిమాణాన్ని బట్టి 25 లక్షల నుంచి కోటి లీటర్ల వరకు నీటిని నిల్వ చేయగలదని, వీటిని కాపాడుకుంటే వానాకాలంలో సిటీలో వరద ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాతిలో చెక్కిన జల విజ్ఞానం
మెట్ల బావులు శిల్పకళా సౌందర్యాన్ని చాటే చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు. ఎండకు నీరు ఆవిరైపోకుండా, బయటి కంటే లోపల దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా మన పూర్వీకులు రూపొందించిన అద్భుత విజ్ఞాన కేంద్రాలు. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, నిజాం పాలకులు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో మెట్ల బావులు కట్టించారు. హైదరాబాద్‌లో సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట (నాగన్నకుంట), గోల్కొండ నయా ఖిలా, కుతుబ్‌షాహీ సమాధుల దగ్గరి బడీ బావులి, మంగళ్‌హాట్ సీతారాంబాగ్ ఆలయం, బాపూఘాట్, గచ్చిబౌలి, సైనిక్‌పురి, బేగంపేట తదితర ప్రాంతాల్లో పురాతన బావులు ఉన్నాయి.
నారాయణపేట జిల్లాలో 80కి పైగా మెట్ల బావులు ఉండగా, అక్కడి బారం బావి ఏటా 30 లక్షల లీటర్ల వాన నీటిని నిల్వ చేయగలదు. వరంగల్ కోట రోడ్డులోని శివనగర్‌లో కాకతీయుల కాలం నాటి 800 ఏండ్ల మూడంతస్తుల రాతి మెట్ల బావి నేటికీ అబ్బురపరుస్తోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్ రామాలయం దగ్గరి బావి రాష్ట్రంలోని అత్యంత పురాతన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కరీంనగర్ జిల్లా ఎలగందుల కోటలోని చంద్రకాంత బావి, కొలనుపాక సోమేశ్వరాలయ బావి, సంగారెడ్డి జిల్లా కీచనపల్లి బావి, గద్వాల కోటలోని బావులు మన ప్రాచీన జల సంస్కృతికి ఆనవాళ్లు. కామారెడ్డి జిల్లా లింగంపేట (నాగన్నగారి బావి), భిక్కనూరు (సిద్ధరామేశ్వరాలయ బావి) అధికారుల చొరవతో పూర్వవైభవం సంతరించుకున్నాయి.
బన్సీలాల్‌పేట మోడల్
మెట్ల బావులను ఆక్రమణల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే వాటికి జియో–ట్యాగింగ్ చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. రాతి కట్టడాల మరమ్మతులు, పూడికతీతకే పరిమితం కాకుండా, బావులు శాశ్వత నీటి వనరులుగా పనిచేయాలంటే వాటికి నీళ్లు అందించే వాగులు, చెరువులు, ఉపనదులు, లోతు తక్కువ భూగర్భ జల వనరులు సహా మొత్తం పరీవాహక ప్రాంతాన్ని రక్షించాలని సూచిస్తున్నారు. బన్సీలాల్‌పేట మెట్ల బావి దగ్గరి పార్కు కింద ఉన్న పూడిక గదులు, తవ్విన బావులు, ఇంజెక్షన్ బోర్వెల్ సహా ఆరు నీటి సంరక్షణ నిర్మాణాలకు ఒకే కాలువ ద్వారా నీళ్లు అందుతున్నాయని, ఫిల్టరేషన్, సిల్ట్ ట్రాప్స్‌తో కూడిన ఈ విధానాన్ని మిగతా బావుల దగ్గరా అమలు చేయొచ్చని చెబుతున్నారు.
కాంక్రీట్ జంగిల్‌తో ముప్పు
సిటీలో పెరుగుతున్న కాంక్రిటీకరణ, అడ్డగోలు నిర్మాణాలు భూగర్భ జలాల రీచార్జికి ప్రధాన అడ్డంకిగా మారాయి. కాంక్రీట్ ఉపరితలాల వల్ల వాన నీరు భూమిలోకి ఇంకడం లేదు. భవనాల బేస్మెంట్ల తవ్వకాల సమయంలో భూగర్భ జలాలను మోటార్లతో బయటికి తోడి వృథా చేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరుద్ధరించిన కొన్ని బావుల్లోకి నీళ్లు చేరుతున్నా, నీటి నాణ్యత మరో తీవ్ర సమస్యగా మారిందని చెబుతున్నారు.
బన్సీలాల్‌పేట, కామారెడ్డి బావుల తరహాలో మిగతావాటినీ పునరుద్ధరించి పర్యాటక, సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దితే చరిత్రను కాపాడుకోవడంతో పాటు స్థానికులకు నీటి భద్రత కూడా దక్కుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బోర్ల వెంట పరుగులు తీస్తున్న మనకు.. పూర్వీకులు వదిలివెళ్లిన జల సంపద మన కండ్ల ముందే ఉంది. దాన్ని కాపాడుకుంటేనే రేపటి తరం గొంతు తడుస్తుంది.
- హైదరాబాద్, వెలుగు
