ఆకాష్ దీప్‌కు గాయం, జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణ.. సిరాజ్ సబ్స్టిట్యూట్గా కూడా పనికిరాడా?

ఆకాష్ దీప్‌కు గాయం, జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణ.. సిరాజ్ సబ్స్టిట్యూట్గా కూడా పనికిరాడా?

Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ విషయంలో ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత పేసర్ ఆకాశ్ దీప్ కంకషన్ (తలకు గాయం) కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకోగా, అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిద్ధ్ కృష్ణను బీసీసీఐ ఎంపిక చేసింది. సీనియర్, అనుభవజ్ఞుడైన బౌలర్ సిరాజ్ బెంచ్‌పై ఉండగా, అతడిని కాదని ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడంపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. మహమ్మద్ సిరాజ్ కనీసం సబ్‌స్టిట్యూట్‌గా కూడా పనికిరాడా? అంటూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ని ప్రశ్నిస్తున్నారు. 

ఆకాశ్ దీప్‌కు గాయం.. ప్రసిద్ధ్ రీఎంట్రీ: 

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 29 పరుగులతో ఆకట్టుకున్న ఆకాశ్ దీప్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు తలకు (హెల్మెట్‌కు) బంతి బలంగా తగిలింది. ముందుగా కివీస్ పేసర్ జాకబ్ డఫీ వేసిన బంతి ఆకాశ్ హెల్మెట్‌కు తాకగా, ఆ తర్వాత కైల్ జెమీసన్ విసిరిన మరో బౌన్సర్ కూడా అతడి తలకు తగిలింది. (మరో ఎండ్‌లో గుర్నూర్ బ్రార్ గొంతు దగ్గర కూడా మ్యాట్ హెన్రీ వేసిన బంతి తాకడంతో ఆట కాసేపు నిలిచిపోయింది). వరుసగా రెండు దెబ్బలు తగలడంతో ఆకాశ్ దీప్‌కు కంకషన్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడు మిగిలిన మ్యాచ్‌కు దూరమవగా, కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు.

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు: 

న్యూజిలాండ్ పర్యటనలో జరిగిన రెండు టెస్టుల తుది జట్టు (Playing XI)లోనూ సిరాజ్‌కు చోటు దక్కకపోవడం ఇప్పటికే వివాదంగా మారింది. పిచ్ కండిషన్స్, కాంబినేషన్ పేరుతో సిరాజ్ వంటి ప్రధాన పేసర్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు. కనీసం ఆకాశ్ దీప్ గాయపడినప్పుడైనా లైక్-ఫర్-లైక్ రీప్లేస్‌మెంట్ కింద సిరాజ్‌కు ఛాన్స్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా ప్రసిద్ధ్ కృష్ణ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ ఇంట్రెస్ట్ చూపించడం గమనార్హం.

గంభీర్ను పట్టించుకోని సిరాజ్: 

కివీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచులో కోచ్ గౌతమ్ గంభీర్ పక్కనుంచి వెళ్తున్నా సిరాజ్ కనీసం పలకరించకుండా ఇగ్నోర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వచ్చిన కొద్దిసేపటికే, సబ్‌స్టిట్యూట్‌గా కూడా సిరాజ్‌ను పక్కన పెట్టడంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. విదేశీ పిచ్‌లపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న సిరాజ్‌ను ఇలా అవమానించడం ఎంత వరకు సమంజసమని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.