దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు రంగంలోకి సోనియా, ఖర్గే, రాహుల్

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం.. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు రంగంలోకి సోనియా, ఖర్గే, రాహుల్

న్యూఢిల్లీ: డీలిమిటేషన్ అంశంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. డీలిమిటేషన్ బిల్లు విషయంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. గతంలో వీగిపోయిన ఈ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే ఇండియా కూటమిలోని డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ వంటి పార్టీల మద్దతు కూడగట్టింది. మరోవైపు, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఎత్తుగడలు మొదలుపెట్టింది. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా తమ మిత్రపక్షాల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగారు. 

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే  తమిళనాడు, ముంబైలో పర్యటించనున్నారు. ఆదివారం (నవంబర్ 29) చెన్నై వెళ్లనున్న సోనియా, రాహుల్, ఖర్గే బృందం మధ్యాహ్నం 2 గంటలకు డీఎంకే అధినేత స్టాలిన్‎తో భేటీ కానున్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతును ఉపసంహరించుకోవాలని కోరనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు ముంబై వెళ్లి ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్‎తో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. కేంద్రం తీసుకువస్తోన్న డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించాలని రిక్వెస్ట్ చేయనున్నారు. 

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి పూర్తి బలం లేదు. ఈ సమయంలోనే డీలిమిటేషన్ బిల్లుకు ప్రతిపక్ష ఇండియా కూటమిలోనే డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. 

డీఎంకే, ఎన్సీపీ మద్దతు డీలిమిటేషన్ బిల్లు గట్టేక్కే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా ఓడించేందుకు ఇండియా కూటమి రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టింది. డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిసి డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పునిర్విభజన బిల్లుకు మద్దతు తెలిపిన డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ పార్టీలు.. ఇండియా కూటమి నేతల భేటీ తర్వాత మనసు మార్చుకుంటారా లేదా మొదటి మాట మీదే నిలబడతారా అనేది యావత్ దేశ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.