సారంగపురం అనే ఊరి మధ్యలో పచ్చని చింతచెట్టు కింద చిన్న అరుగు ఉండేది. ఆ ఊరి పండితుడు గంగాధరశాస్త్రి తన పంచాంగ పరిజ్ఞానంతో గ్రామస్తులకు ఎన్నో సందేహాలను తీరుస్తూ, వ్యవసాయ పనులకు, శుభకార్యాలకు తగిన కాలాన్ని సూచిస్తూ గౌరవం పొందుతుండేవాడు.
జ్యోతిష్యశాస్త్రం తన వంతుగా కాలగమనాన్ని, గ్రహగతులను క్రమబద్ధంగా సూచిస్తుంది కానీ, చేయాల్సిన పనిని ఆచరణలో పెట్టాల్సింది మనుషులేనని శాస్త్రి ఎప్పుడూ చెబుతుండేవాడు. గంగాధరశాస్త్రి శేఖర్‌ను చిన్నప్పుడే చేరదీసి ఆప్యాయంగా చదివించాడు. కానీ శేఖర్ పదో తరగతి వరకు చదివి, జ్యోతిష్యంపై ఉన్న మక్కువతో మిగతా చదువు మానేసి, పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు.
శేఖర్‌కు శ్రమపడే గుణం ఉన్నా, రాశిఫలాలు, ముహూర్తాలను గురించి ఆలోచిస్తూ, ఏ పనినైనా వెంటనే మొదలుపెట్టకుండా తనలో తానే అనవసరమైన లెక్కలు వేసుకుంటూ సమయాన్ని వృథా చేసే అలవాటు ఉండేది.ఒక రోజు ఉదయం సారంగపురంలో పండుగ సందడి జోరుగా సాగుతోంది. ఊరిలో జరిగే అన్నదానానికి, ఇంటికి వచ్చే అతిథుల కోసం పొలం పక్కనే ఉన్న తోట నుంచి తాజా పండ్లు, కూరగాయలు బుట్టలో వేసుకుని తీసుకురావాలని శాస్త్రిగారు శేఖర్‌కు పురమాయించాడు. “మధ్యాహ్నం కల్లా వంటావార్పు మొదలు కావాలి శేఖర్. తొందరగా వెళ్లి బుట్ట నింపుకుని రా” అని చెప్పాడు.
శేఖర్ బుట్ట తీసుకుని బయలుదేరాడు కానీ, తోటలోకి వెళ్లిన తర్వాత పండ్లు కోయడం మానేసి, ఒక చెట్టు నీడలో నిలబడి ఆలోచనలో మునిగిపోయాడు. “ఏ రాశివారు ఏ పని ఎప్పుడు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది? ఏ సమయంలో మొదలు పెడితే ఆటంకం కలగకుండా పని పూర్తవుతుంది? నేను ఇప్పుడు చేయబోయే ఈ పండు కోసే పనిని ఏ రాశివారు ఏ సమయంలో చేస్తే మేలు?” అంటూ రాశిఫలాల లెక్కలు మొదలుపెట్టాడు.
ముందుగా చివరి రాశి అయిన మీనం నుంచి ప్రారంభించి, కుంభం, మకరం, ధనుస్సు, వృశ్చికం, తుల, కన్య, సింహం, కర్కాటకం, మిథునం, వృషభం దాటి మొదటి రాశి అయిన మేషం వరకు లెక్కించాడు. అక్కడితో ఆగకుండా, మళ్లీ మేషం నుంచి వృషభం, మిథునం ఇలా వరుసగా లెక్కిస్తూ తిరిగి మీనం వరకు లెక్కలు వేయడం మొదలుపెట్టాడు.
పొద్దు ఎక్కుతున్నా శేఖర్ తిరిగి రాలేదు. పరిస్థితి గమనించిన గంగాధరశాస్త్రి స్వయంగా తోట దగ్గరకు వచ్చాడు. అక్కడ శేఖర్ చేతిలో బుట్ట పట్టుకుని ఆలోచనలో నిలబడి ఉండటం చూసి, “ఏమిటి శేఖర్! సమయం మించిపోతోంది కదా, ఇంకా బుట్ట నింపలేదే?” అని అడిగాడు. శేఖర్ కొంచెం తడబడుతూ, “అది కాదు గురువుగారు... పండు కోసే ముందు రాశిఫలాల గురించి ఆలోచిస్తున్నాను.
ఏ రాశివారు ఏ పని ఎప్పుడు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది, ఏ సమయంలో మొదలు పెడితే ఆటంకం కలగకుండా పని పూర్తవుతుందో, ఈ పనిని ఏ రాశివారు ఏ సమయంలో చేస్తే మేలో అని మీనం నుంచి మేషం వరకు లెక్కించి, మళ్లీ మేషం నుంచి మీనం వరకు లెక్క సరిచూస్తున్నాను. ఈ లెక్క పూర్తి చేసి పని మొదలుపెడదామని ఆగాను” అని సమాధానమిచ్చాడు.
శేఖర్ మాటలు విన్న గంగాధరశాస్త్రికి విషయం స్పష్టంగా అర్థమైంది. తాను చేరదీసి పెంచిన కుర్రాడికి జ్యోతిష్యంపై ఆసక్తి ఉండటం సంతోషమే కానీ, దాన్ని సాకుగా చేసుకుని అసలు పనిని వాయిదా వేయడం, అటూఇటూ లెక్కలు వేస్తూ సమయాన్ని పాడు చేయడం తప్పు అని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. “చూడు శేఖర్ జ్యోతిష్యం, రాశిఫలాలు వాటి దారిలో అవి ఎంతో క్రమబద్ధమైనవి. కానీ నువ్వు చేసే పనిని ఆలస్యం చేయడానికి ఆ లెక్కలను సాకుగా వాడుకుంటున్నావు.
మీనం నుంచి మేషం వరకూ, మళ్లీ మేషం నుంచి మీనం వరకూ ఇలా అటూఇటూ లెక్కలు వేస్తూ కూర్చుంటే చేయాల్సిన పని ముందుకు సాగదు. అనవసరమైన సందేహాలతో, కుంటిసాకులతో సమయాన్ని వృథా చేయడం వల్ల చేయవలసిన పని ఆగిపోతుంది. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి కానీ, కాలయాపనకు సాధనంగా మార్చుకోకూడదు. ముందు పని పూర్తి చెయ్యి!” అని సున్నితంగా మందలించాడు.
గంగాధరశాస్త్రి మాటల్లోని నిజాన్ని శేఖర్ అర్థం చేసుకున్నాడు. తాను అనవసరమైన లెక్కలతో, సాకులతో సమయాన్ని వృథా చేస్తున్నానని గ్రహించి, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చురుగ్గా పండ్లు, కూరగాయలు కోసి బుట్ట నింపాడు.
ఆ రోజు నుంచీ సారంగపురంలో ఎవరైనా చేయాల్సిన పనిని పక్కన పెట్టి, మీనం నుంచి మేషం వరకూ, మేషం నుంచి మీనం వరకూ లెక్కలు వేస్తున్నట్టు అనవసరమైన సందేహాలు, సాకులతో కాలయాపన చేస్తూ నిలబడితే, “ఏమిటి, మీనమేషాలు లెక్కిస్తున్నావా?” అని సరదాగా అంటూ ఉండేవారు.
రాశిచక్రాన్ని అటూఇటూ లెక్కించడం, పని ముందుకు కదలకుండా సాకులతో సమయాన్ని వృధా చేసే అలవాటు ఇవన్నీ కలిసిన ఆ ప్రవర్తనకు ‘మీనమేషాలు లెక్కించడం’ అనే జాతీయం పుట్టిందని ఊరంతా చెప్పుకునేవారు. శేఖర్ కూడా ఆ రోజు నుంచి అనవసరమైన సందేహాలను పక్కన పెట్టి, సరైన సమయంలో పని పూర్తి చేయడం అలవాటు చేసుకున్నాడు.
- డా.పోతగాని సత్యనారాయణ-
గమనిక: మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతో పాటు [email protected] కి మెయిల్ చేయండి.
