సంగీత ప్రియులకు పండగే! హైదరాబాద్లో నెల రోజులపాటు భారీ సంగీత కచేరి

సంగీత ప్రియులకు పండగే! హైదరాబాద్లో నెల రోజులపాటు  భారీ సంగీత కచేరి

స్వరాలకు సరిహద్దులు లేవు.. సంగీతానికి తరాల అంతరాలు లేవు. ఐదు దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంగీత సమారోహం సిటీ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుంటే, డిసెంబర్  నెల కచేరీలతో హైదరాబాద్ మరోసారి సంగీత సాగరంలో ఓలలాడనుంది! దేశంలోని ప్రముఖ సంగీత విద్వాంసులు, యువ కళాకారులు ఒకే వేదికపై తమ ప్రతిభతో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తారు. 

హిందుస్థానీ, కర్నాటక శాస్త్రీయ సంగీతం, భక్తి గీతాలు, గజల్స్, సూఫీ–ఖవ్వాలీ, జానపద గీతాలు, శాస్త్రీయ నృత్యాలు.. భారతీయ సంగీతంలోని విభిన్న ప్రక్రియలకు వేదికగా 54వ పండిట్ మోతీరామ్–పండిట్ మణిరామ్ సంగీత సమారోహం మాదాపూర్‌‌లోని సీసీఆర్‌‌టీ యాంఫీథియేటర్‌‌లో ఏడు రోజులుగా సాగుతోంది. నవంబర్  29 నుంచి  ఉత్సవంలో 150 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇక ఏడాది చివర,  పండుగలు, కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో డిసెంబర్ నెలంతా సిటీ సంగీత విభావరులతో ఓలలాడనుంది.

పద్మవిభూషణ్ పండిట్ జస్రాజ్ వారసత్వాన్ని, ఆయన కుటుంబానికి హైదరాబాద్‌‌తో ఉన్న అనుబంధాన్ని స్మరిస్తూ సాగుతున్న ఈ సంగీత సమారోహానికి అందరికీ ఉచిత ప్రవేశం ఉంది; రిజర్వ్‌‌డ్ సీటింగ్ కోసం వీఐపీ డోనర్ పాస్‌‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ గాయని కౌశికి చక్రవర్తి లైవ్ కచేరీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముగింపు రోజైన 30న 45 మందికి పైగా సంగీతకారుల లైవ్ సింఫనీతో ప్రత్యేక ‘8 ప్రహర్ రాగాల’ ప్రదర్శన జరగనుంది. నేరుగా రాలేనివాళ్ల కోసం యూట్యూబ్‌‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని పండిట్ జస్రాజ్ కల్చరల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ‘సంగీతానికి పరివర్తన శక్తి ఉందని జస్రాజ్ జీ నమ్మారు. 

అందుకే ఈసారి సంగీతానికి, మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధంపై ప్రత్యేక కార్యక్రమం పెట్టాం’ అని దుర్గా జస్రాజ్ చెప్పారు. జస్రాజ్ శిష్యుడు డాక్టర్ విజయ్ సాతే 35 ఏండ్లకు పైగా మ్యూజిక్ థెరపీ ద్వారా దవాఖానల్లో రోగులతో కలిసి పనిచేస్తున్నారు. హైదరాబాద్‌‌లోనే అత్యంత పురాతనమైన ఈ సంగీతోత్సవానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోంది. జస్రాజ్ వారసత్వాన్ని ఫౌండేషన్ భవిష్యత్ తరాలకు అందించడం ఆనందంగా ఉందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

‘కోటి-50’ భారీ కచేరీ

సంగీత దర్శకుడు కోటి ఐదు దశాబ్దాల సంగీత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ‘కోటి–50’ పేరిట సిటీలోనే అతిపెద్ద లైవ్ కచేరీని డిసెంబర్ 26న గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ లాన్స్‌‌లో నిర్వహిస్తున్నామని మనాటో ఎంటర్‌‌టైన్‌‌మెంట్ నిర్వాహకుడు తోకల శోభన్‌‌బాబు తెలిపారు. 

నెలంతా సంగీత సందడి

అంతర్జాతీయ డీజేల నుంచి తెలుగు కచేరీలు, జాజ్, జానపదం, సూఫీ సంగీతం దాకా.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 31 వరకు సిటీలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. పాపన్, బిస్మిల్ కీ మెహఫిల్, బోరిస్ బ్రెజ్చా, లిల్లీ పామర్ వంటి కళాకారుల ప్రదర్శనలూ రానున్నాయి. ఐఐటీ హైదరాబాద్ సెంటర్ ఫర్ క్రియేటివ్ ఆర్ట్స్ ఇటీవల నిర్వహించిన కర్నాటక సంగీత సాయంత్రంలో విద్యార్థులు తమ ప్రతిభ చాటారు.

కచేరీల క్యాలెండర్

నవంబర్ 29: కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ ఫెస్ట్ ‘ప్రోనైట్’ (రాత్రి 8 నుంచి 10.30 వరకు): తెలుగు, బాలీవుడ్ హిట్స్, లైవ్ బ్యాండ్, డీజే
నవంబర్ 29: ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌‌లో పత్రీజీ సంస్థ ఆధ్వర్యంలో గాయని యషికా ధారా ‘ధ్యాన ఆనందోత్సవం’
డిసెంబర్ 5: శంకర్‌‌పల్లి మిర్జాగూడ ‘ఆర్టిసన్ బే ఫెస్ట్’: 40కి పైగా కళాకారుల స్టాల్స్, లైవ్ మ్యూజిక్డి
డిసెంబర్ 6: బేగంపేట గ్రీన్‌‌ల్యాండ్స్ సెస్ ఆడిటోరియంలో ‘మర్హమ్’: కవితా పఠనం, సూఫీ సంగీతం
డిసెంబర్ 12: గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌‌లో జానపద రాత్రి: రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, రాము రాథోడ్, వందేమాతరం శ్రీనివాస్ 
డిసెంబర్ 12: ‘దర్బార్ ఈవెనింగ్స్’ ఆర్కెస్ట్రల్ ఖవ్వాలీ: స్వరకర్త రుషిల్ రంజన్, ఖవ్వాల్ అబి సంపా ఆధ్వర్యంలో పాశ్చాత్య శాస్త్రీయ, కోరల్, సూఫీ సంగీత మేళవింపు
డిసెంబర్ 12: మాదాపూర్ విండ్‌‌మిల్స్ క్రాఫ్ట్‌‌వర్క్స్‌‌లో ‘గ్లోబల్ గిటార్ గీత’: కోణార్క్ రెడ్డి, జూలీ మాలియా, డైలాన్ ఫౌలర్ 
డిసెంబర్ 12: జీపీ బిర్లా సెంటర్‌‌లో ‘రెడీ టు స్లే’ క్రిస్మస్ కచేరీ
డిసెంబర్ 19: కింగ్‌‌డమ్ క్లబ్ అండ్ కిచెన్‌‌లో ‘ది రఘు దీక్షిత్ ప్రాజెక్ట్ – డెక్కన్ ఫోక్ జామ్’ (రాత్రి 8)
డిసెంబర్ 19: అర్బన్ మాయాబజార్‌‌లో రాహుల్ సిప్లిగంజ్ లైవ్ కాన్సర్ట్ (రాత్రి 8)
డిసెంబర్ 26: గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్‌‌లో ‘కోటి–50’
డిసెంబర్ 27: శిల్పకళా వేదికలో ఎం.జి.శ్రీకుమార్ లైవ్ కాన్సర్ట్
డిసెంబర్ 27: బషీర్‌‌బాగ్ భారతీయ విద్యాభవన్‌‌లో ‘శాంతి, ఐక్యత కోసం సంగీతం’ 
డిసెంబర్ 31: ‘ది ప్రిజం సర్కస్ 2027’ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ నైట్, గాయకుడు కార్తీక్ న్యూ ఇయర్ ఈవ్ 
డిసెంబర్ 31: గచ్చిబౌలి స్టేడియంలో ఏఆర్ రెహమాన్ ‘వండర్‌‌మెంట్’