హైదరాబాద్ అనగానే చార్మినార్, బిర్యానీతో పాటు హుస్సేన్ సాగర్ కూడా కండ్ల ముందు కదలాడుతుంది. సిటీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ఈ చారిత్రక సరస్సు ఇప్పుడు కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలతో సతమతమవుతోంది. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాగర్‌కు పూర్వ వైభవం సాధ్యం. అందుకే సరస్సుపై ప్రేమను బాధ్యతగా మార్చేందుకు ‘వాసవి క్లబ్ బుద్ధపూర్ణిమ’ ‘ఐ లవ్ హుస్సేన్ సాగర్ లేక్’ పేరుతో ప్రత్యేక ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
సరస్సు పరిరక్షణ, వారసత్వంపై అవగాహన, పర్యాటక ప్రోత్సాహం లక్ష్యంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఉన్న ఈ క్లబ్, హుస్సేన్ సాగర్‌లోని ఖైరున్నిసా బోటులో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రచార సామగ్రిని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.మాన్వి జగన్ ఆవిష్కరించారు. ‘హుస్సేన్ సాగర్ లేనిదే హైదరాబాద్ అసంపూర్ణం’, ‘ఇది సరస్సు కంటే ఎక్కువ.. ఇదే హైదరాబాద్ గుర్తింపు’ వంటి సందేశాలతో క్లబ్ ప్రచారం చేస్తోంది.
సరస్సును చెత్తకుండీలా చూడొద్దని వాలంటీర్లు సిటీ జనాన్ని కోరుతున్నారు. సాగర్‌ను కాపాడుతామని క్లబ్‌కు చెందిన వంద మంది ప్రతిజ్ఞ చేశారు. హుస్సేన్ సాగర్ హైదరాబాద్ వారసత్వంలో, గుర్తింపులో అమూల్యమైన భాగమని, ‘హుస్సేన్ సాగర్‌ను ప్రేమిద్దాం.. వారసత్వ సంపదను కాపాడుకుందాం’ అనే సందేశంతో ఈ ప్రచారం చేస్తున్నామని క్లబ్ అధ్యక్షుడు వి.ఎన్.తెరుకుంట్ల వెంకట్ రఘురామ్ చెప్పారు. చారిత్రక మైలురాయి అయిన సాగర్ ఇంజనీరింగ్ అద్భుతమే కాదు, వినోద, పర్యాటక కేంద్రమని, దానిపై ప్రజలకున్న అభిమానాన్ని బాధ్యతగా మార్చడమే ఈ ప్రచారం లక్ష్యమని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డీ .రామచంద్రం తెలిపారు.
460 ఏండ్ల చరిత్ర
హుస్సేన్ సాగర్ ఒక చెరువు కాదు, నాలుగున్నర శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం. జంట నగరాల మధ్య కొలువుదీరిన ఈ జలాశయం కుతుబ్‌షాహీల నుంచి నిజాం పాలన దాకా ఎన్నో చారిత్రక పరిణామాలను చూసింది. నాలుగో కుతుబ్‌షాహీ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో క్రీ.శ. 1562–63 ప్రాంతంలో నగర తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ఆనకట్ట కట్టి ఈ లేక్ నిర్మించారు. దీని నిర్మాణాన్ని పర్యవేక్షించిన హజ్రత్ హుస్సేన్ షా వలీ పేరు మీదుగా హుస్సేన్ సాగర్‌గా పేరొచ్చింది.
నిర్మాణం తర్వాత దాదాపు 375 ఏండ్ల పాటు ఇదే సిటీకి ప్రధాన నీటి వనరు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వచ్చాక తాగునీటిలో దీని పాత్ర తగ్గింది. ఆనకట్టపై ఏర్పడిన దారి హైదరాబాద్, సికింద్రాబాద్‌ను కలిపే ముఖ్య మార్గమైంది. కాలక్రమంలో ట్యాంక్‌బండ్ పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా మారింది. తెలుగు ప్రముఖుల విగ్రహాలు, పార్కులు, బోటింగ్, నెక్లెస్ రోడ్ సాగర్‌కు కొత్త కళ తెచ్చాయి. 1992లో సాగర్ మధ్యలోని జిబ్రాల్టర్ రాక్‌పై బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
కాలుష్య కాసారం
ఒకప్పుడు సిటీ దాహం తీర్చిన సాగర్ ఇప్పుడు మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్‌తో ఉక్కిరిబిక్కిరవుతోంది. నీటిపై నురగ, రంగు మారిన నీళ్లు, భరించలేని దుర్వాసన సాగర్ దుస్థితికి అద్దం పడుతున్నాయి. బల్కాపూర్, బంజారాహిల్స్, కూకట్పల్లి, పికెట్ నాలాల నుంచి మురుగునీరు సాగర్‌లో కలుస్తోంది. సిటీ, శివార్లలోని పరిశ్రమల రసాయన వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్త చేరుతున్నాయి. వినాయక నిమజ్జనాల వల్ల రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, పూజా సామగ్రి నీటి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. అడుగున పేరుకుపోయిన సేంద్రియ వ్యర్థాలు సాగర్‌ను మరింత కలుషితం చేస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేసిన పరీక్షల్లో సాగర్ నీటిలో టర్బిడిటీ, టీఎస్ఎస్, సీవోడీ, బీవోడీ, కోలిఫామ్ బ్యాక్టీరియా స్థాయిలు పెరిగాయని తేలింది.
కోట్లు ఖర్చు చేసినా..
సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రత్యేకంగా బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటు చేసి పలు పనులు చేపట్టినా కాలుష్యం తగ్గడం లేదు. నాచు, దుర్వాసన నియంత్రణకు హెచ్ఎండీఏ గతేడాది చేపట్టిన ప్రాజెక్టు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఏడు ఫ్లోటింగ్ ట్రాష్ స్కిమ్మర్లతో ప్లాస్టిక్, థర్మకోల్, బాటిళ్లను తొలగించినా నాలాల ద్వారా మళ్లీ వచ్చి చేరుతున్నాయి. మురుగు సాగర్‌లోకి రాకుండా నిర్మించిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సరిగా పనిచేయకపోవడంతో కలుషిత నీరు జలాశయంలోకి వస్తూనే ఉంది. హుస్సేన్ సాగర్ అందం మనందరిదీ.. దాని పరిరక్షణ బాధ్యత కూడా మనందరిదే! సరస్సు దగ్గర ఫొటోలు దిగడమే కాదు, దాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అప్పుడే నిజమైన అర్థంలో చెప్పగలం.. ఇలా ఐ లవ్ హుస్సేన్ సాగర్!
