హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం (నవంబర్ 29) చెన్నైకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి ఢిల్లీ నుంచి చెన్నైకి పయనించనున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే అధినేత స్టాలిన్‌తో కాంగ్రెస్ నేతలు చర్చించనున్న ఈ భేటీలో రేవంత్ పాల్గొననున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు ఇండియా కూటమిలోని డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ అనూహ్యంగా మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా ఉండేందుకు ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. కీలక మిత్రపక్షాలైన శరద్ చంద్ర పవార్, ఎంకే స్టాలిన్‌లతో సంప్రదింపులు జరపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే చెన్నై, ముంబై వెళ్లి స్టాలిన్, శరద్ పవార్‌తో భేటీ కానున్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలని కోరనున్నారు.
లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి పూర్తి బలం లేదు. ఈ సమయంలోనే డీలిమిటేషన్ బిల్లుకు ప్రతిపక్ష ఇండియా కూటమిలోనే డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి.
డీఎంకే, ఎన్సీపీ మద్దతు డీలిమిటేషన్ బిల్లు గట్టేక్కే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా ఓడించేందుకు ఇండియా కూటమి రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టింది. డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిసి డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పునిర్విభజన బిల్లుకు మద్దతు తెలిపిన డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ పార్టీలు.. ఇండియా కూటమి నేతల భేటీ తర్వాత మనసు మార్చుకుంటారా లేదా మొదటి మాట మీదే నిలబడతారా అనేది యావత్ దేశ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
