కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రింకూ సింగ్, షాయ్ హోప్.. పఠాన్ ఎవరికి ఓటేశాడంటే?

కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రింకూ సింగ్, షాయ్ హోప్.. పఠాన్ ఎవరికి ఓటేశాడంటే?

KKR Captain: అజింక్య రహానే రిటైర్మెంట్ చేయడంతో ఐపీఎల్ 2027 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ త్వరలో జరగనున్న వేలానికి సిద్ధమవుతుండగా, ఆ జట్టుకు రింకూ సింగ్ సరైన కెప్టెన్ అవుతాడని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. 

రింకూ సింగ్‌కే పఠాన్ మద్దతు ఎందుకు?: 

జియోస్టార్ (JioStar) టాటా ఐపీఎల్ 2027 రిటెన్షన్ స్పెషల్ కార్యక్రమంలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్, ప్రస్తుత స్క్వాడ్‌లో నాయకత్వ లక్షణాలున్న ఆటగాళ్లు ఎక్కువగా లేరని, రింకూ సింగ్ అత్యుత్తమ ఎంపిక అని పేర్కొన్నాడు. కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు రింకూ సింగ్‌కు అప్పగిస్తారనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుత జట్టులో లీడర్‌షిప్ ఆప్షన్లు తక్కువగా ఉన్నందున రింకూనే బెస్ట్ ఛాయిస్ అని పఠాన్ అన్నాడు. అలాగే 2018 నుంచి కేకేఆర్‌తోనే కొనసాగుతున్న రింకూ, గత సీజన్‌లో రహానేకు డిప్యూటీ (వైస్ కెప్టెన్)గా పని చేయడం అతడికి కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.

వేలంలో షాయ్ హోప్‌ను టార్గెట్ చేస్తారా?: 

ఒకవేళ కేకేఆర్ మేనేజ్‌మెంట్ వేలంలోకి వెళ్లి అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, వెస్టిండీస్ వికెట్ కీపర్-బ్యాటర్ షాయ్ హోప్ మంచి ఆప్షన్ అవుతాడని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హోప్ 4 మ్యాచ్‌ల్లో రెండు అజేయ సెంచరీలతో సహా 261 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే కేకేఆర్ మేనేజ్‌మెంట్ పని తీరును బట్టి చూస్తే రింకూ సింగ్‌కే కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పఠాన్ అంచనా వేశాడు.

ఐపీఎల్ 2027 కోసం కేకేఆర్ ప్రక్షాళన: 

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 2024లో మూడోసారి టైటిల్ గెలిచిన కేకేఆర్, ఆ తర్వాత రెండు సీజన్లలో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027 వేలానికి ముందు రహానేతో పాటు మతీషా పతిరనా, ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి ఆటగాళ్లను విడుదల చేసింది. రింకూ సింగ్‌తో పాటు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, కామెరూన్ గ్రీన్, హర్షిత్ రాణా వంటి కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న కేకేఆర్, కొత్త కెప్టెన్ ఎంపికతో తిరిగి టైటిల్ రేసులోకి రావాలని చూస్తోంది.