బ్రదర్ స్టాలిన్.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి: డీఎంకే చీఫ్‎కు రాహుల్ రిక్వెస్ట్

బ్రదర్ స్టాలిన్.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించండి: డీఎంకే చీఫ్‎కు రాహుల్ రిక్వెస్ట్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‎ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన రాహుల్.. డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకేతో చర్చించేందుకు ఆదివారం (నవంబర్ 29) ఇండియా కూటమి నేతలు చెన్నై వెళ్తున్నట్లు తెలిపారు. లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదన ప్రజాస్వామ్యానికి, దేశ ఎన్నికల వ్యవస్థకు ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీట్ల సంఖ్యను పెంచడం వల్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు దేశ ఎన్నికల మ్యాప్‌ను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని విమర్శించారు. రాజ్యాంగాన్ని, రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఈ బిల్లులను ఓడించడం అవసరమని నొక్కిచెప్పారు.

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు, 2026ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి పార్లమెంట్ ఉభయ సభల్లో పూర్తి బలం లేదు. ఈ తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలైన డీఎంకే, ఎన్సీపీ ఎస్పీ పార్టీలు అనూహ్యంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించాయి.

డీఎంకే, ఎన్సీపీ మద్దతుతో డీలిమిటేషన్ బిల్లు గట్టేక్కే చాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును ఎలాగైనా అడ్డుకునేందుకు ఇండియా కూటమి రంగంలోకి దిగింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం మమతా బెనర్జీతో పాటు పలువురు కూటమి నేతలు ఆదివారం (నవంబర్ 29) చెన్నై, ముంబైలో పర్యటించి డీఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‎ను కలిసి డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పునిర్విభజన బిల్లుకు మద్దతు తెలిపిన డీఎంకే, ఎన్సీపీ.. ఇండియా కూటమి నేతల భేటీ తర్వాత మనసు మార్చుకుంటాయా లేదా మొదటి మాట మీదే నిలబడతారా అనేది యావత్ దేశ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.