కోటి రూపాయల పందెం.. లక్ష రూపాయల చెక్కు.. మధ్యలో సుకుమార్ కన్నీళ్లు.. ఇదేదో సినిమా కథలో ట్విస్ట్ అనుకుంటున్నారా? కాదు.. నిజంగానే జరిగింది. పుష్పతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ను ఒక సినిమా ఎమోషనల్‌గా కదిలించేసింది. సినిమా చూసి ఏడవకుండా బయటకు వస్తే ఏకంగా కోటి రూపాయలు ఇస్తానని నిర్మాత అల్లు అరవింద్ ఛాలెంజ్ విసిరితే.. తీరా థియేటర్ నుంచి బయటకు వచ్చాక సుకుమార్ చేతిలో లక్ష రూపాయల చెక్కు కనిపించింది. అసలు అల్లు అరవింద్ అంత కాన్ఫిడెంట్‌గా ఆ పందెం ఎందుకు కాశారు? సుకుమార్ లాంటి దర్శకుడినే కన్నీళ్లు పెట్టించిన ఆ సినిమా కథలో ఏముంది? ఇది సినిమా మీద ఉన్న నమ్మకమా.. లేక ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు అల్లు అరవింద్ వేసిన మాస్టర్ ప్లానా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్..
అల్లు అరవింద్ వేసిన మాస్టర్ ప్లాన్!
టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్లకు కొత్త పంథాను పరిచయం చేయడంలో అల్లు అరవింద్ శైలి ప్రత్యేకం. సినిమా మీద నమ్మకం ఉంటే దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఎలాంటి అవకాశాన్నీ వదులుకోరు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ విషయంలోనూ అదే జరిగింది. అయితే ఈసారి ఆయన ఎంచుకున్న ప్రమోషన్ అస్త్రం ఒక స్టార్ డైరెక్టర్. అది కూడా నేషనల్ అవార్డు విన్నర్ సుకుమార్..
నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను చూడాలని సుకుమార్‌కు అల్లు అరవింద్ ఫోన్ చేశారు. అయితే మామూలుగా సినిమా చూడమని చెప్పడంతో సరిపెట్టలేదు. ఒక ఆసక్తికరమైన పందెం కూడా పెట్టారు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక్క కన్నీటి చుక్క కూడా రాకపోతే సుకుమార్‌కు కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. అదే ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం సుకుమార్ లక్ష రూపాయలు ఇవ్వాలని కండిషన్ పెట్టారు.
సినిమా చూసిన తర్వాత సుకుమార్‌కు ఆ పందెంలో గెలిచే అవకాశం లేకుండా పోయింది. కథలోని భావోద్వేగాలకు ఆయన కూడా కనెక్ట్ అయిపోయారు. దీంతో తన ఓటమిని అంగీకరిస్తూ అల్లు అరవింద్ పేరు మీద లక్ష రూపాయల చెక్కును రాసి, ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు.
‘‘నిన్న అరవింద్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ విసిరారు. ఆకాశంలో ఒక తార సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు. లేదంటే నేను లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఎంత ఖరీదైన సిఫార్సు సార్ ఇది’’ అంటూ సుకుమార్ సరదాగా రాసుకొచ్చారు.
ఒకవైపు లక్ష రూపాయల చెక్కు.. మరోవైపు సుకుమార్ పెట్టిన ఈ సరదా కామెంట్‌తో సినిమా పేరు ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ఛాలెంజ్ కేవలం సరదా కోసమేనా? లేక సినిమా చూసేలా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించేందుకు అల్లు అరవింద్ వేసిన మార్కెటింగ్ ఎత్తుగడనా? అన్న చర్చ కూడా మొదలైంది.
‘ఆకాశంలో ఒక తార’లో అసలు ఎమోషన్ ఇదే..
ఈ సినిమాలో అసలు ప్రత్యేకతేంటంటే.. హీరో తన కల కోసం కాదు, భార్య కలను నిజం చేయడం కోసం పోరాడతాడు. పల్లెటూరికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి)కి చిన్నప్పటి నుంచి వ్యోమగామి కావాలనే ఆశ. కానీ కుటుంబ పరిస్థితులు, సమాజంలోని ఆంక్షలు ఆమె కలకు అడ్డుపడతాయి. చివరకు చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది.
ఆమె జీవితంలోకి వచ్చిన కృష్ణ (దుల్కర్ సల్మాన్) ఓ సాధారణ మెకానిక్. అయితే భార్య ఆశయాన్ని అర్థం చేసుకుని, ఆమె కలను తన లక్ష్యంగా మార్చుకుంటాడు. ఎన్నో కష్టాలు, త్యాగాలు ఎదురైనా కల్పనను ఆమె గమ్యం వైపు నడిపిస్తాడు.
భార్య కల కోసం భర్త చేసే ప్రయాణం, వారి మధ్య ప్రేమానుబంధాలు, ఎమోషనల్ సీన్స్ ఈ కథకు ప్రధాన బలం. ప్రేమంటే తోడుగా ఉండటమే కాదు.. ఎదుటివారి కలలకు రెక్కలు ఇవ్వడం కూడా అని సినిమా చెబుతుంది. దర్శకుడు పవన్ సాధినేని 2020 నుంచే ఈ కథపై పని చేయడం ప్రారంభించినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎమోషన్స్‌కు అసలైన బలం..దుల్కర్, సాత్విక నటన..
ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నటన ప్రధాన ఆకర్షణ. స్టార్ హీరో ఇమేజ్‌ను పక్కనపెట్టి ఓ సాధారణ మెకానిక్‌గా కనిపిస్తూ, భార్య కలను నిజం చేయాలనే భర్తగా మెప్పించారు. ప్రేమ, బాధ, త్యాగం వంటి భావాలను తన సహజమైన నటనతో పండించారు. ఇక సాత్విక వీరవల్లి కల్పన పాత్రలో ఆకట్టుకున్నారు. అమాయకమైన పల్లెటూరి అమ్మాయి నుంచి తన ఆశయం కోసం పోరాడే యువతి వరకు పాత్రలోని విభిన్న కోణాలను చక్కగా చూపించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఆమె నటన సినిమాకు ప్లస్ అయింది.
మరోవైపు శ్రుతి హాసన్ రోహిణి పాత్రలో కీలకంగా కనిపించగా, రుహానీ శర్మ, స్వాసిక, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాజర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా దుల్కర్, సాత్విక మధ్య కెమిస్ట్రీ కథలోని ప్రేమానుబంధాలను మరింత సహజంగా చూపించింది.
పాటలు, బీజీఎంతో ఎమోషన్స్‌కు మరింత బలం..
‘ఆకాశంలో ఒక తార’లో కథ ఎంత ముఖ్యమో.. ఆ భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరవేయడంలో సంగీతం కూడా అంతే కీలకం. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా 'రాధే రాధే', 'చిట్టి చిట్టి చీమ' పాటలు కథలో భాగంగా సాగుతూ ఆకట్టుకుంటాయి.
ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను పాత్రల భావోద్వేగాలకు మరింత దగ్గర చేస్తుంది. ఇక సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, అంతరిక్ష నేపథ్యాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించింది. గున్నం గంగరాజు స్క్రీన్‌ప్లే, సంభాషణలు కథకు మరింత బలాన్నిచ్చాయి. అయితే అంతరిక్షానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంకాస్త నాణ్యత చూపించి ఉంటే సినిమా మరింత ఆకట్టుకునేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అల్లు అరవింద్ ఛాలెంజ్.. ప్రమోషనా? సినిమా మీద నమ్మకమా?
సుకుమార్‌తో అల్లు అరవింద్ వేసిన కోటి రూపాయల పందెం ఇప్పుడు సినిమాకు మరోసారి ప్రచారం తెచ్చిపెట్టింది. ఒక స్టార్ డైరెక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నాడనే విషయం ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తిని పెంచుతుంది. ఇది కేవలం సరదాగా వేసిన పందెమా? లేక సినిమా భావోద్వేగాలపై అల్లు అరవింద్‌కు ఉన్న నమ్మకాన్ని చాటే ప్రయత్నమా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేం.
కానీ ఈ సంఘటన సినిమాపై చర్చను పెంచిందనడంలో సందేహం లేదు. విడుదలైన తొమ్మిది రోజుల తర్వాత కూడా సినిమా గురించి కొత్తగా మాట్లాడుకునేలా చేసింది. మొత్తానికి కోటి రూపాయల ఛాలెంజ్‌లో సుకుమార్ ఓడిపోయినా.. ఆ పందెం మాత్రం ‘ఆకాశంలో ఒక తార’కు మంచి ప్రచారాన్ని తీసుకొచ్చింది.
మొత్తానికి... సినిమా ప్రమోషన్‌లో కోట్లు ఖర్చు చేసే రోజుల్లో.. ఒక లక్ష రూపాయల చెక్కుతో ఇంతటి చర్చకు తెరలేపడం అల్లు అరవింద్ మార్కెటింగ్ తెలివికి నిదర్శనమనే చెప్పాలి. అయితే ఆ ఛాలెంజ్‌లో నిజమైన విజేత ఎవరు? కోటి రూపాయలు దక్కించుకోలేకపోయిన సుకుమారా? లేక ప్రేక్షకుల మనసులు గెలుచుకోవాలనుకున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమానా? అన్నది ఇప్పుడు ఆసక్తికరం!
