బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ' మాన్స్టర్'. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచానాలు నెలకొన్నాయి. లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై దక్షిణాది ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సల్మాన్ సర్ ప్రైజ్ గిఫ్ట్..
దర్శకుడు వంశీ పైడిపల్లికి సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.కోటి విలువైన లగ్జరీ వాచ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న తన కెరీర్లో తొలిసారిగా ఓ తెలుగు దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో 'మాతృభూమి' ప్రమోషన్ల సందర్భంగా వంశీ పైడిపల్లితో పనిచేసిన అనుభవం గురించి అడగ్గా.. "దర్శకుడిగా, వ్యక్తిగా ఆయన అద్భుతం" అంటూ సల్మాన్ ప్రశంసించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై మరింత ఆసక్తి పెరిగింది.
భారీ తారాగణంతో..
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతారతో పాటు జాకీ ష్రాఫ్, పరేశ్ రావల్, అరవింద్ స్వామి, రాజ్‌పాల్ యాదవ్, సీమా బిశ్వాస్, రాహుల్ దేవ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తొలుత SVC63 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం 'మాన్స్టర్' పేరుతో ప్రచారంలో ఉంది. షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీకై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.
అయితే నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారిక టైటిల్ పోస్టర్‌ను ఇంకా విడుదల చేయలేదు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఈద్ 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు దిల్ రాజు, సల్మాన్ ఖాన్ వెల్లడించారు. మరి సల్మాన్ మాస్ ఇమేజ్‌కు వంశీ పైడిపల్లి స్టైలిష్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి..
