చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చమ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చరణ్‌జిత్ సింగ్ ఆదివారం (నవంబర్ 29) పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆప్ టికెట్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆప్‌కు గుడ్ బై చెప్పిన చరణ్‌జిత్ సింగ్ శిరోమణి అకాలీ దళ్‌లో చేరారు. శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. కాగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఓడించి చరణ్‌జిత్ సింగ్ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
టికెట్ నిరాకరణపై అసంతృప్తి
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ తనకు టికెట్ నిరాకరించడంపై చరణ్‌జిత్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆప్ ఈసారి పంజాబ్ బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్వీర్ సింగ్ గర్హిని బరిలోకి దింపింది. పార్టీ నిర్ణయం తర్వాత చరణ్‌జిత్ సింగ్ స్పందిస్తూ.. ఏ పరిస్థితుల్లోనైనా తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేగా తాను నిజాయితీగా పని చేశానని, తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. పార్టీ తనను ఎందుకు విస్మరించిందో అర్థం కావడం లేదని చరణ్‌జిత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి కావాలని పార్టీని ఎప్పుడూ అడగలేదని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో చమ్‌కౌర్ సాహిబ్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చరణ్‌జిత్ సింగ్, 2022లో ఆప్ టికెట్‌పై గెలిచారు.
2022 ఎన్నికల్లో భారీ విజయం
గత అసెంబ్లీ ఎన్నికల్లో చరణ్‌జిత్ సింగ్ 70,248 ఓట్లు సాధించి రాజకీయ సంచలనం సృష్టించారు. కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి 62,306 ఓట్లు వచ్చాయి. దాదాపు 7,942 ఓట్ల మెజారిటీతో చరణ్‌జిత్ సింగ్ విజయం సాధించారు. అప్పటి నుంచి పంజాబ్ రాజకీయాల్లో ఆయన కీలక నేతగా ఎదిగారు.
బీజేపీ, ఎస్ఏడీ పొత్తు
మరోవైపు 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ, ఎస్ఏడీ మళ్లీ చేతులు కలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ మేరకు ప్రకటించారు. ఈ పునఃకలయికతో రెండు పార్టీల మధ్య ఆరేళ్ల విరామం ముగిసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా అకాలీ దళ్ 2020 సెప్టెంబర్‌లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది.
దీంతో రెండు పార్టీల మధ్య ఉన్న 24 ఏళ్ల పొత్తు ముగిసింది. ఇప్పుడు మళ్లీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో అకాలీ దళ్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి ఎస్ఏడీ నుంచే ఉంటారని అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసరడమే లక్ష్యంగా ఈ కూటమి పని చేయనుంది.
