Suryakumar Yadav: జట్టులో చోటు కోల్పోయినా, విమర్శలు ఎదురైనా తన బ్యాటింగ్ శైలిలో ఎలాంటి తప్పు లేదని టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. జూన్-జూలైలో జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచి తనను తప్పించి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సూర్య.. తాజాగా దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ మళ్లీ టీమ్ లోకి పునరాగమనంపై కన్నేశాడు. శనివారం ( నవంబర్ 28, 2026) నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ తన ఆటతీరు, ఇటీవలి కష్టకాలపై మనసులోని మాట బయటకు చెప్పాడు.
సయ్యద్ ముస్తాక్ అలీలో జోరు.. పరుగుల దాహం:
ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా 230 స్ట్రైక్‌రేట్‌తో 204 పరుగులు చేసి, ముంబై జట్టును నాకౌట్ దశకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. తన బ్యాటింగ్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న సూర్య.. నా బ్యాటింగ్‌లో ఏదైనా తప్పు జరిగిందని నేను అనుకోవడం లేదు.. గత ఐదేళ్లుగా నేను ఇదే శైలిలో ఆడుతున్నాను.. టీమిండియా తరఫునైనా, ముంబై తరఫునైనా ఎక్కడ బ్యాటింగ్ చేసినా ఆటను ఆస్వాదించానని చెప్పాడు.
గణాంకాలు పడిపోయినా అదే నమ్మకం:
* గత కొంతకాలంగా సూర్యకుమార్ యాదవ్ గణాంకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం చర్చనీయాంశమైంది. 2025 ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌ల్లో 717 రన్స్ చేసిన సూర్య, 2026లో 13 మ్యాచ్‌ల్లో 270 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక 2025 అంతర్జాతీయ టీ20ల్లో 21 మ్యాచ్‌ల్లో 13.62 సగటుతో కేవలం 218 పరుగులే చేశాడు.
* టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ (321) తర్వాత భారత్ తరఫున అత్యధికంగా 242 పరుగులు చేసినా, అమెరికాపై 84 పరుగుల తర్వాత వరుసగా 12, 32, 34, 18, 33, 18, 1, 0 పరుగులతో తడబడ్డాడు.
* సంఖ్యలు ఎలా ఉన్నా తన అప్రోచ్‌ను మార్చుకోలేదని సూర్య వివరించాడు. గత 8-10 వారాలుగా చేసిన కఠిన ప్రాక్టీస్ ఇప్పుడు మైదానంలో ఫలితాలు ఇస్తోందని, ఎంత కష్టపడితే అదృష్టం అంతగా కలిసి వస్తుందని పేర్కొన్నాడు.
షో మస్ట్ గో ఆన్.. ముంబైపైనే పూర్తి దృష్టి:
ఐదేళ్ల పాటు నిరంతరం భారత జట్టుకు ఆడిన తర్వాత ఒక్కసారిగా జట్టుకు దూరమవడం బాధ కలిగించిందని సూర్య అంగీకరించాడు. టీమిండియాకు దూరంగా ఉండటం ఖచ్చితంగా బాధాకరమే. ఐదేళ్లు వరుసగా ఆడిన తర్వాత ఉన్నట్టుండి జట్టులో లేకపోతే నొప్పి ఉంటుంది. కానీ ఈ ఆట స్వభావమే అంతే. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది.. అప్పటివరకు ఆట (షో) ఆగకూడదని సూర్యకుమార్ ఎమోషనల్ అయ్యాడు. ముందున్న విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీ రెండో దశ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని.. ప్రస్తుతానికి సూపర్ లీగ్‌లో ప్రతి మ్యాచ్ గెలిచి, ముంబైని ఫైనల్‌లో విజేతగా నిలపడమే తన తక్షణ లక్ష్యమని స్కై తేల్చి చెప్పాడు.
