Scene OTT Release: ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ 'సీన్'.. స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చంటే?

Scene OTT Release: ఓటీటీలోకి సూర్య బ్లాక్‌బస్టర్ 'సీన్'.. స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీన్' (Scene). దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మరేపింది. 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.268 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  అయితే ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. 

ముఖ్యంగా సూర్య నటన, జితు మాధవన్ విభిన్నమైన దర్శకత్వ శైలి, కామెడీతో మిళితమైన క్రైమ్ థ్రిల్లర్ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంతో 2026లో సూర్య ఖాతాలో మరో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా చేరింది. 
ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్ పాత్రలో కనిపించారు. గతంలో ఓ సీరియల్ కిల్లర్ కేసును ఛేదించిన పోలీస్ అధికారి.. మరోసారి అలాంటి హత్యల మిస్టరీని పరిష్కరించేందుకు రంగంలోకి దిగడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ఊహించని మలుపులు, హాస్య సన్నివేశాలు కథను రసవత్తరంగా నడిపిస్తాయి.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, మరోసారి చూడాలనుకునే అభిమానులు డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 4 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 

ALSO READ : Ramayana Creates Box Office: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'రామాయణ'.. ధురంధర్ 2 రికార్డు బద్దలు.. దంగల్‌పై కన్నేసిన రణ్‌బీర్!

ఇక ఈ సినిమాతో నజ్రియా నజీమ్ 12 ఏళ్ల విరామం తర్వాత తమిళ సినిమాల్లోకి తిరిగి వచ్చారు. నస్లెన్, ఆనందరాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  సుషిన్ శ్యామ్ సంగీతం అందించగా, సూర్య, జ్యోతిక తమ నిర్మాణ సంస్థల ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్.. డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుండటంతో ఓటీటీ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి డిజిటల్ వేదికపై 'సీన్' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి..