శర్వానంద్, సంపత్ నంది కాంబోలో వచ్చిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. కథనం, సెకండాఫ్, మితిమీరిన హింసపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా నెమ్మదించాయి. మొదటి రోజు ఓ మోస్తరు వసూళ్లతో ప్రారంభమైన భోగి.. రెండో రోజు మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. వీకెండ్లో శనివారం కూడా వసూళ్లు తగ్గడం చిత్రబృందానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. మరి రెండు రోజుల్లో భోగి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది? సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? హిట్ కావాలంటే ఇంకా ఎన్ని కోట్లు రాబట్టాలి? అనే వివరాలు ఇలా ఉన్నాయి..
భోగి రెండో రోజు కలెక్షన్లు..
భోగి రెండో రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గాయి. Sacnilk లెక్కల ప్రకారం శనివారం ఇండియాలో రూ.1.37 కోట్ల నెట్ వసూలు చేసింది. తొలి రోజు రూ.1.90 కోట్లతో పోలిస్తే దాదాపు 28 శాతం డ్రాప్ నమోదైంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.4 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా. దీంతో ఆదివారం కలెక్షన్లపైనే చిత్రబృందం ఆశలు పెట్టుకుంది. అయితే, సోమవారం నుంచి వసూళ్లు మరింత తగ్గితే బ్రేక్ ఈవెన్ కష్టమే అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు...
భోగి బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?
భోగి సినిమాకు ప్రమోషన్ ఖర్చులతో కలిపి సుమారు రూ.34 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.16.75 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.
- ఏపీ, తెలంగాణ: రూ.12 కోట్లు
- ఓవర్సీస్: రూ.2.25 కోట్లు
- కర్ణాటక, మిగతా భారత్: రూ.1.50 కోట్లు
- మొత్తం బిజినెస్: రూ.16.75 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక బిజినెస్ జరగడంతో ఇక్కడి వసూళ్లే సినిమా విజయానికి కీలకం కానున్నాయి.
భోగి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఏ సినిమా అయినా హిట్ కావాలంటే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి తగిన వసూళ్లు రావాలి. భోగి విషయంలో థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.16.75 కోట్లు కావడంతో.. డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడిని తిరిగి రాబట్టాలంటే దాదాపు అంతే స్థాయిలో షేర్ వసూళ్లు రావాల్సి ఉంటుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రూ.16.75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది డిస్ట్రిబ్యూటర్ల షేర్‌కు సంబంధించిన అంచనా. ప్రపంచవ్యాప్తంగా వచ్చే గ్రాస్ కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే షేర్ ఒకటి కాదు. కాబట్టి రూ.16.75 కోట్ల షేర్ సాధించడమే థియేట్రికల్ బ్రేక్ ఈవెన్‌కు కీలకం.
ప్రస్తుత కలెక్షన్లు, మిక్స్డ్ టాక్ చూస్తుంటే భోగికి బ్రేక్ ఈవెన్ చేరుకోవడం సవాలుగానే కనిపిస్తోంది. శర్వానంద్ నటనకు ప్రశంసలు వస్తున్నా.. తగ్గుతున్న వసూళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. రూ.16.75 కోట్ల షేర్ టార్గెట్‌ను చేరుకోవాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగా పుంజుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయన్నదానిపైనే భోగి హిట్, ఫ్లాప్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
