అమెరికా సైన్యంపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్‌ని వాడుకుందా ? ఎలాన్ మస్క్ కంపెనీకి కొత్త చిక్కులు!

 అమెరికా సైన్యంపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్‌ని వాడుకుందా ? ఎలాన్ మస్క్ కంపెనీకి కొత్త చిక్కులు!

అమెరికా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సర్వీస్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా బలగాలపై దాడులు చేసేందుకు ఎలోన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ను  ఇరాన్ ఉపయోగించుకుందని ఓ   రిపోర్ట్  వెల్లడించింది. సైనిక బలగాల మధ్య సమాచార మార్పిడి, డ్రోన్ దాడులకు సంబంధించి ఈ టెక్నాలజీని ఉపయోగించినట్లు సమాచారం.

ఈ విషయంపై  ప్రముఖ వార్తా సంస్థ 'ది వాషింగ్టన్ పోస్ట్' ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌తో పాటు అమెరికా సైన్యం కూడా స్టార్‌లింక్‌కు చెందిన మరో వెర్షన్ అయిన 'స్టార్‌షీల్డ్'ను ఉపయోగిస్తుండటంతో ఎలాన్ మస్క్ అసహనానికి గురైనట్లు  పేర్కొంది.

ఇరాన్ దాడుల్లో స్టార్‌లింక్ పాత్ర 
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీనికి ప్రతికారంగా ఇరాన్ కూడా ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ సమయంలో  సైనిక కార్యకలాపాలకు అవసరమైన సమాచార వ్యవస్థగా ఇరాన్ స్టార్‌లింక్‌ను ఉపయోగించుకున్నట్లు 'ది వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై స్పేస్‌ఎక్స్ సంస్థ కానీ, ఎలాన్ మస్క్ కానీ స్పందించలేదు.

అమెరికా కూడా స్టార్‌షీల్డ్‌ను ఉపయోగిస్తోందా 
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అమెరికా సైన్యం కూడా స్టార్‌లింక్‌కు చెందిన సైనిక అవసరాల కోసం రూపొందించిన 'స్టార్‌షీల్డ్' సర్వీసును ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. సైనిక కార్యకలాపాల్లో భాగంగా డ్రోన్ల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు దేశాలు వాటి  సైనిక అవసరాల కోసం ఒకే సంస్థకు చెందిన టెక్నాలజీని ఉపయోగిస్తుండటంతో ఎలోన్ మస్క్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ, స్టార్‌లింక్ ద్వారా ఆ దేశానికి మరో సమాచార మార్గం అందుబాటులోకి వచ్చిందని నివేదిక తెలిపింది.

అమెరికా రక్షణ శాఖ ఏమంటోంది?
 ఇరాన్ సైనిక దాడుల్లో స్టార్‌లింక్ ఉపయోగించిందా ? పోర్ట్ షువైబాపై జరిగిన దాడిలో ఈ టెక్నాలజీ పాత్ర ఉందా ? అనే ప్రశ్నలకు సమాధానం  లేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ అంశంపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించింది. మరోవైపు, ఈ దాడికి సంబంధించి పెంటగాన్ విచారణ వివరాలను ఇంకా బయటపెట్టలేదు.

ఇరాన్ ప్రజలకు ఇంటర్నెట్ ఇవ్వడమే అసలు సమస్య 
ఈ వ్యవహారంలో స్పేస్‌ఎక్స్‌కు మరో పెద్ద సమస్య కూడా ఎదురైంది. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో అధికారులు ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సేవలను నిలిపివేశారు. దీంతో సాధారణ ప్రజలు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండేందుకు స్టార్‌లింక్ జనవరిలో ఉచిత సేవలను అందించినట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' గతంలో వెల్లడించింది. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చిన స్టార్‌లింక్ డివైజెస్ సైనిక బలగాలు కూడా ఉపయోగించే అవకాశం ఉండటంతో సమస్య మొదలైంది.

సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించాలి. అదే సమయంలో ఆ టెక్నాలజీని శత్రు దేశ సైన్యం ఉపయోగించకుండా అడ్డుకోవాలి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ పాటించడం స్పేస్‌ఎక్స్‌కు పెద్ద సవాలుగా మారిందని ఉపగ్రహ పరిశ్రమకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ : పాకిస్తాన్‌లో ఫన్నీ సీన్.. 90 గ్రాములని 90 రూపాయలుగా పలికిన మహిళా అధికారి.. చివరికి ఏమైందంటే !

ఇరాన్‌లో స్టార్‌లింక్ సేవలను పూర్తిగా నిలిపివేస్తే ప్రభుత్వ వ్యతిరేకులకు కూడా ఇంటర్నెట్ అందకుండా పోతుంది. అలా కాకుండా సేవలను కొనసాగిస్తే ఇరాన్ సైన్యం కూడా వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు కంపెనీకి ప్రధాన సమస్యగా మారింది.

మొత్తానికి, సాధారణ ప్రజలకు ఇంటర్నెట్ అందించేందుకు ఉపయోగపడే స్టార్‌లింక్ టెక్నాలజీనే సైనిక అవసరాలకు కూడా వాడుతున్నారన్న ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. అయితే ఇరాన్ సైనిక కార్యకలాపాల్లో స్టార్‌లింక్ వినియోగంపై వచ్చిన ఈ ఆరోపణలను సంబంధిత సంస్థలు, ప్రభుత్వాలు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.