పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లుకు ఎన్డీయేతర పక్షాలైన వైసీపీ, డీఎంకే, ఎన్సీపీ శరద పవార్ వర్గం తదితరులు మద్దతు తెలపడంతో ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే అన్న పరిస్థితి నెలకొంది. అయితే.. ఇండి కూటమి మాత్రం ఈ బిల్లును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో డీలిమిటేషన్ పై చర్చించేందుకు ఇండి కూటమి నేతలతో కలిసి తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి చేరుకున్నారు సోనియా గాంధీ. దీంతో డీఎంకే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకుంటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
ఈ సందర్భంగా స్టాలిన్ నివాసానికి విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి స్వయంగా సాదర స్వాగతం పలికారు స్టాలిన్. మొదట చెన్నై ఎయిర్ పోర్టు నుంచి ఇండి కూటమి నేతలు ప్రత్యేక బస్సుల్లో స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. ఈ బృందంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీషన్ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ లతో తదితరులు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఉపసంహరించుకోవాలని స్టాలిన్ ను కోరేందుకు ఇండి కూటమి నేతలతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లును వ్యతిరేకించాలని.. విపక్షాల ఐక్యతను చాటాలని ఇండియా కూటమి నేతలు స్టాలిన్‌కు విజ్ఞప్తి చేయనున్నారు.
మరోవైపు, ఇప్పటికే తమ డిమాండ్లకు కేంద్రం అంగీకరించడంతో బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గేది లేదని డీఎంకే సంకేతాలు ఇచ్చిన క్రమంలో ఈ భేటీ కీలకంగా మారింది. సోనియా గాంధీ సహా ఇండి కూటమి అగ్రనేతల రిక్వెస్ట్ కు స్టాలిన్ ఎలా రియాక్ట్ అవుతారు అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
