హైదరాబాద్: ‘నేను చనిపోయాక నా ఆస్తి అనాథ పిల్లలకు ఇవ్వండి.. నా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను కూడా వారి సంక్షేమం కోసమే వినియోగించండి’ అంటూ నోట్ రాసి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో విషాదం నింపింది. మరణానికి ముందు ఆమె రాసిన లేఖలోని వివరాలు పలువురిని కలచివేస్తున్నాయి. మియాపూర్‌లోని ప్రజయ్ మెగాపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న సింధూజ అలియాస్ తుషారిక (36) హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
2015లో ఆమెకు వివాహం కాగా, దాంపత్య జీవితంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా పదేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఒంటరితనం, మానసిక ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు లేఖలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
అయితే తన మరణం తర్వాత తన ఆస్తి అనాథ పిల్లలకు ఉపయోగపడాలని ఆమె ఆకాంక్షించారు. తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, తన ఆస్తి మొత్తాన్ని కేర్ ట్రస్ట్‌కు ఇవ్వాలని సూసైడ్ నోట్‌లో కోరారు. అలాగే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను కూడా అనాథ పిల్లల సంక్షేమం కోసం వినియోగించాలని పేర్కొన్నారు. ఉన్నతమైన ఉద్యోగంలో కొనసాగుతున్న 36 ఏళ్ల మహిళ ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, సూసైడ్ నోట్‌లోని అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
