ఫారెన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ముందుగానే విమాన టికెట్లు, హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటుంటాం. ముఖ్యంగా ప్రయాణం సాఫీగా సాగాలని డైరెక్ట్ ఫ్లైట్లకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి మాత్రం ఎయిర్‌లైన్ షాకిచ్చింది. రూ.1.16 లక్షలు పెట్టి థాయిలాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటే.. చివరకు కనెక్టింగ్ ఫ్లైట్లు కేటాయించింది. అదీ ఒకటి కాదు.. ఏకంగా 11 గంటల పాటు మరో సిటీలో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో విసిగిపోయిన ఆ కుటుంబం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. కేసును విచారించిన తెలంగాణ వినియోగదారుల కమిషన్.. ఎయిర్‌లైన్ తప్పు చేసినట్లు గుర్తించి, బాధిత కుటుంబానికి రూ.70 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
రూ.1.16 లక్షలు పెట్టి డైరెక్ట్ ఫ్లైట్
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఫ్యామిలీ కోసం హైదరాబాద్ నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లేందుకు రానుపోను విమాన టికెట్లు బుక్ చేశారు. 2026 జూన్ 6 నుంచి 13 వరకు ప్రయాణించేందుకు మొత్తం రూ.1,16,477 ఖర్చు చేశారు. అంతేకాదు, ఎక్స్ట్రా లగేజీ కోసం మరో రూ.2,949 కట్టారు. డైరెక్ట్ ఫ్లైట్లలో ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకున్న ఆ కుటుంబం.. ఫుకెట్‌లో హోటల్ రూమ్స్ కూడా ముందుగానే బుక్ చేసుకుంది. అయితే ఆ హోటల్ బుకింగ్‌ను క్యాన్సల్ చేసుకుంటే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా లేదు. అంతా అనుకున్నట్లు సాగుతుందనుకుంటున్న సమయంలో మే 21న ఎయిర్‌లైన్ నుంచి వారికి ఊహించని మెసేజ్ వచ్చింది. వారు బుక్ చేసుకున్న డైరెక్ట్ ఫ్లైట్లు ఇకపై నడవవని, వాటికి బదులు వేరే విమానాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది.
డైరెక్ట్ ఫ్లైట్ బదులు 11 గంటల వెయిటింగ్
ఎయిర్‌లైన్ చేసిన మార్పులతో ఆ కుటుంబం జర్నీ ప్లాన్ మొత్తం మారిపోయింది. హైదరాబాద్ నుంచి వెళ్లే సమయంలో బెంగళూరులో 2 గంటల 40 నిమిషాలు ఆగి మరో విమానం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక తిరుగు ప్రయాణంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. బెంగళూరులో ఏకంగా 11 గంటల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. ముందుగా డైరెక్ట్ ఫ్లైట్లను బుక్ చేసుకున్న మాకు ఇలా కనెక్టింగ్ ఫ్లైట్లు కేటాయించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని బాధితుడు తెలిపాడు. ముఖ్యంగా కుటుంబంతో ప్రయాణం చేస్తున్న సమయంలో ఇంతసేపు విమానాశ్రయంలో వేచి ఉండటం కష్టంగా మారిందని చెప్పాడు. అంతేకాదు, ఈ వెయిటింగ్ సమయంలో ఉండేందుకు హోటల్ లేదా ఇతర సౌకర్యాలను కూడా ఎయిర్‌లైన్ ఏర్పాటు చేయలేదని ఆరోపించాడు. దీంతో ఎక్స్ట్రా ఖర్చులను కూడా మేమె భరించాల్సి వచ్చిందని కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.
ఎయిర్‌లైన్‌కు నోటీసులు..
ఈ వ్యవహారంపై తెలంగాణ వినియోగదారుల కమిషన్ విచారణ చేపట్టింది. ఎయిర్‌లైన్ తరఫున న్యాయవాది విచారణకు హాజరైన, కమిషన్ ఇచ్చిన 45 రోజుల గడువులోగా సంస్థ లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించలేదు. దీంతో వాదనను లిఖితపూర్వకంగా సమర్పించే అవకాశాన్ని కమిషన్ మూసివేసింది. మరోవైపు, విమానాల షెడ్యూల్లో మార్పులు, నిర్వహణకు సంబంధించిన కారణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎయిర్‌లైన్ పేర్కొన్నప్పటికీ.. ముందుగా కన్ఫర్మ్ చేసిన విమానాలను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందనే దానికి సరైన ఆధారాలు చూపించలేకపోయింది. విమానాలు రద్దయినా, ఆలస్యమైనా ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్‌పై ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.
నలుగురికి కలిపి రూ.70 వేల పరిహారం
ఈ కేసులో ప్రయాణికులు చివరకు ప్రత్యామ్నాయ విమానాల్లో ప్రయాణాన్ని పూర్తి చేసిన విషయాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. అందువల్ల మొత్తం ప్రయాణా ఖర్చులను తిరిగి చెల్లించకుండా, వారికి జరిగిన ఇబ్బందులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నలుగురు ప్రయాణికుల్లో ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున మొత్తం రూ.60 వేలు చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా కేసు ఖర్చుల కింద మరో రూ.10 వేలు ఇవ్వాలని సూచించింది. దీంతో ఎయిర్‌లైన్ మొత్తం రూ.70 వేలు బాధిత కుటుంబానికి చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ : ఇద్దరు ఐఐటీ యువకుల అదిరిపోయే ఐడియా.. బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన !
మొత్తానికి, డైరెక్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి సరైన కారణం లేకుండా కనెక్టింగ్ ఫ్లైట్లు కేటాయించి ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.
