Ramayana OTT Release: ఓటీటీలో 'రామాయణ' స్ట్రీమింగ్‌పై నమిత్ మల్హోత్రా కీలక ప్రకటన.. రూ.450 కోట్ల డీల్‌పై నిర్మాత క్లారిటీ!

Ramayana OTT Release: ఓటీటీలో 'రామాయణ' స్ట్రీమింగ్‌పై నమిత్ మల్హోత్రా కీలక ప్రకటన.. రూ.450 కోట్ల డీల్‌పై నిర్మాత క్లారిటీ!

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక ఇతిహాస చిత్రం 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే  రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రూ. 2వేల కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. 

భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో వెండితెరపై ఆవిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్స్, స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

అయితే థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంటున్న ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్మాత నమిత్ మల్హోత్రా ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పట్లో ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఇంట్లో కూర్చొని రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రను చూడాలనుకుంటున్న అభిమానులు మరికొంతకాలం ఎదురుచూడక తప్పేలా లేదు.

లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నమిత్ మల్హోత్రా సినిమా డిజిటల్ విడుదలపై కీలక విషయాలు వెల్లడించారు. 'రామాయణ పార్ట్ 1' ఓటీటీ హక్కులను ఇప్పటివరకు ఏ సంస్థకూ విక్రయించలేదని తెలిపారు. అంతేకాదు, ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్‌తో రూ.450 కోట్ల భారీ డీల్ కుదిరిందనే వార్తలను కూడా ఆయన ఖండించారు. అలాంటి ఒప్పందం ఏదీ చేసుకోలేదని, సమీప భవిష్యత్తులో అలాంటి డీల్ చేసుకునే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు.

ALSO READ : Ramayana Creates Box Office: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'రామాయణ'.. ధురంధర్ 2 రికార్డు బద్దలు.. దంగల్‌పై కన్నేసిన రణ్‌బీర్!

ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద తెరపై చూసి అద్భుతమైన అనుభూతిని పొందాలన్నదే తన ప్రధాన లక్ష్యమని నిర్మాత పేర్కొన్నారు. ఇక 'రామాయణ పార్ట్ 2'ను 2028లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి పార్ట్ 1 ఓటీటీ విడుదలపై నిర్మాతలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో చూడాలి...