దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. అయితే ఈ ప్రక్రియలో రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యం, రాజకీయ ప్రయోజనాలు, కమిటీ సభ్యుల ఎంపికపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలో డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించాలని శరద్ పవార్, ఎంకే స్టాలిన్లకు ఉద్ధవ్ థాకరే విజ్ఞప్తి చేయడంతో రాజకీయంగా ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్లకు శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ పేరుతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, ఏ ప్రాంతాల్లో తమకు ఓట్లు వచ్చాయో తెలుసుకుని 850 స్థానాల కూర్పును నిర్ణయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.
డీలిమిటేషన్ కమిటీ సభ్యుల ఎంపికపైనా థాకరే అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిటీలో ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందని అన్నారు. ఎంపిక ప్రక్రియలో లోపాలున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మహిళల పేరుతో రాజకీయాలు చేస్తూ వారిని మోసం చేయొద్దని ప్రభుత్వాన్ని విమర్శించారు.
ALSO READ : సోనియా, రాహుల్ స్వయంగా కలిసి చెప్పినా మనసు మార్చుకోని స్టాలిన్ !
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో కేంద్రం ఎన్నికల ప్యాటర్న్ లో మార్పులకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభల స్థానాలను 50 శాతం పెంచాలని ప్రతిపాదించింది. 2027 జనాభా లెక్కల కోసం వేచి చూడకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని యోచిస్తోంది. 132వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్సభ గరిష్ఠ స్థానాలను 850కి, రాష్ట్ర అసెంబ్లీల స్థానాలను 650కి పెంచే ప్రతిపాదన ఉంది. ఈ మార్పులు 2029 ఎన్నికలకు ముందే అమల్లోకి వచ్చేలా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
