సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి వార్తల్లో నిలిచారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'స్పిరిట్' తర్వాత ఆయన చేయబోయే చిత్రం ఏది? ఎవరితో అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'యానిమల్ పార్క్' ( Animal Park ) చిత్రాన్ని తదుపరి ప్రాజెక్టుగా తెరకెక్కించనున్నట్లు వంగా స్పష్టం చేశారు . దీంతో రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది.
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తండ్రీకొడుకుల మధ్య సంక్లిష్టమైన అనుబంధం, హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, బలమైన ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రణ్‌బీర్ పోషించిన రణ్‌విజయ్ సింగ్ పాత్రకు భారీ స్పందన లభించింది. చివర్లో సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన హింట్ ఇవ్వడంతో 'యానిమల్ పార్క్'పై అప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.
ఇప్పుడు ఈ సీక్వెల్‌లో మరింత ఆసక్తికరమైన అంశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్ ఇందులో డబుల్ రోల్‌లో కనిపించనున్నారనే సమాచారం అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. రణ్‌విజయ్‌తో పాటు అతడి పోలికలతో ఉండే అజీజ్ పాత్ర కూడా కథలో కీలకంగా మారనుంది. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణ, ఆధిపత్య పోరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశముంది. అయితే నటీనటులు, షూటింగ్ షెడ్యూల్, విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు డార్లింగ్ 'స్పిరిట్' పై కూడా భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే వంగా 'యానిమల్ పార్క్' పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇక మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌లతో వంగా భవిష్యత్తులో సినిమాలు చేయనున్నారనే ప్రచారం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. అయితే ఆ కాంబినేషన్లపై అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతానికి మాత్రం 'యానిమల్ పార్క్'తో వంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తారోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...
