డీలిమిటేషన్ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది: రాహుల్‌ గాంధీ

డీలిమిటేషన్ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది: రాహుల్‌ గాంధీ

చెన్నై: డీలిమిటేషన్ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పేరుతో దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు.

లోక్‌సభ స్థానాలను 850కి పెంచి, డీలిమిటేషన్ ద్వారా దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ప్రతిపాదన అమలైతే దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టాలిన్‌తో తమ భేటీ స్నేహపూర్వకంగా జరిగిందని, డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను ఆయనకు వివరించినట్లు తెలిపారు.

సీట్ల పెంపు పేరుతో నియోజకవర్గాల హద్దులను పునర్వ్యవస్థీకరించి, దేశ రాజకీయ సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. ఇప్పటికే అస్సాం, జమ్మూకశ్మీర్‌లో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఈ ప్రక్రియ వల్ల జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్టాలిన్కు చెప్పాల్సిందంతా చెప్పామని.. తమిళనాడుకు కూడా డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని రాహుల్ చెప్పారు.

ALSO READ : మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు.. స్టాలిన్ నిట్టూర్పు

బీజేపీ ప్రతిపాదనను అడ్డుకోవడం ద్వారా తమిళనాడు ప్రయోజనాలను కాపాడాలని స్టాలిన్‌ను కోరినట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల స్వరూపం మారితే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని రాహుల్ హెచ్చరించారు. ఇది కేవలం పార్లమెంటు స్థానాల సంఖ్యకు సంబంధించిన అంశం కాదని, దేశ సమాఖ్య వ్యవస్థ, రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం, ప్రాంతీయ అస్తిత్వాలకు సంబంధించిన విషయమని ఆయన వివరించారు. భవిష్యత్తులో తమిళ సంస్కృతి, భాషపైనా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.