కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వీడియో ఫుటేజీ మిస్సింగ్ పై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణతో పాటు కీలక రికార్డులను భద్రపరచాల్సిన బాధ్యతను ఎలా నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి పనికిరాని సాకులు చెప్పొద్దని.. తదుపరి విచారణ నాటికి వీడియో ఫుటేజీని సమర్పించాలని, చర్యలు తప్పవని హెచ్చరించింది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శృంగేరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి టి.డి. రాజేగౌడ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే, బీజేపీ అభ్యర్థి డి.ఎన్. జీవరాజ్ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు రీకౌంటింగ్‌కు ఆదేశించింది. తిరిగి లెక్కించగా ఫలితం మారడంతో జీవరాజ్ విజేతగా ప్రకటించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
►ALSO READ | అందరి త్యాగాలు కొందరి భోగాలు..పార్లమెంటులో గళమెత్తిన ఎంపీలు..స్వరాష్ట్రమే లక్ష్యంగా ఎమ్మెల్యేల ఫోరం
ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా రీకౌంటింగ్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని సమర్పించాలని ధర్మాసనం ఈసీని కోరింది. అయితే, ఆ వీడియో అందుబాటులో లేదని ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో రికార్డులు భద్రపరచాల్సిన బాధ్యతపై ఈసీ నిర్లక్ష్యాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.
రీకౌంటింగ్‌లో పోస్టల్ బ్యాలెట్లు, చెల్లని ఓట్ల పునఃపరిశీలనతో ఫలితం మారిందని రాజేగౌడ తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తుది తీర్పు వచ్చే వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. తదుపరి విచారణలోపు వీడియో ఫుటేజీని సమర్పించాలని ఈసీని ధర్మాసనం ఆదేశించింది.
