కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ఇండియా కూటమి నేతలు ఆదివారం (నవంబర్ 29) రాత్రి ముంబైకి చేరుకున్నారు. దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్‌ను వారు కలవనున్నారు. అంతకు ముందుకు చెన్నైలో తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ తో చర్చలు జరిపారు కాంగ్రెస్ నేతలు. లోక్ సభలో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్న క్రమంలో తాజాగా విపక్షాలతో రాహుల్, సోనియా మంతనాలపై ఉత్కంఠ నెలకొంది.
నవంబర్ 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలన్న తమ పార్టీ వైఖరిని పునఃపరిశీలించుకోవాలని పవార్‌ను ఇండియా కూటమి నేతలు కోరనున్నట్లు సమాచారం. రాహుల్ తో పాటు మల్లిఖార్జున్ ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, సీఎంరేవంత్ రెడ్డి, మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ అంశంపై ఇప్పటికే చెన్నైలో తమిళనాడు మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఈ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా చెన్నైకి వచ్చారు. అయితే ఆమె ముంబైకి వెళ్లలేదు.
ALSO READ : డీలిమిటేషన్‌పై డీఎంకే మద్దతు.. అన్నామలై సంచలన కామెంట్స్
డీహైడ్రేషన్‌కు గురైన శరద్ పవార్ ప్రస్తుతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ముంబై విమానాశ్రయంలో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇండియా కూటమి ప్రతినిధులకు స్వాగతం పలికారు. డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల వైఖరిని ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. డీలిమిటేషన్ మద్దతు విషయంలో శరద్ పవార్ తన మనసు మార్చుకుంటారా లేదా అనే అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
