కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ బస్సుల అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ ఆర్టీసీ బస్ డిపోలో మరోసారి ఎలక్ట్రికల్ బస్సులో మంటలు చెలరేగాయి. డిపోలో నిలిపి ఉంచిన బస్సులో ఒక్కసారిగా మంటలు కనిపించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా.. కరీంనగర్లో ఎలక్ట్రికల్ బస్సులు అగ్నిప్రమాదాలకు గురికావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అలుగునూర్ చౌరస్తా సమీపంలో ఓ ఎలక్ట్రికల్ బస్సులో మంటలు చెలరేగాయి. మరో సందర్భంలో కరీంనగర్ ఆర్టీసీ డిపోలోనే రెండు ఎలక్ట్రికల్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. తాజాగా అదే డిపోలో మరో బస్సులో మంటలు చెలరేగడంతో ఆర్టీసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ఎలక్ట్రికల్ బస్సుల భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా బస్సుల్లో ఉపయోగించే బ్యాటరీల నాణ్యత, ఛార్జింగ్ వ్యవస్థ, విద్యుత్ కనెక్షన్లు, నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలపై చర్చ జరుగుతోంది. బస్సులను డిపోలో నిలిపి ఉంచిన సమయంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో.. గతంలో జరిగిన ప్రమాదాలతో పాటు తాజా ఘటనపైనా అధికారులు సమగ్ర విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.
ALSO READ : ఘట్కేసర్లో భారీ ట్రాఫిక్ జామ్.. హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు
అగ్నిప్రమాదాలకు అసలు కారణాలను గుర్తించి, సాంకేతిక లోపాలు ఉంటే సరిదిద్దాలని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల వినియోగంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని అభిప్రాయపడుతున్నారు.
