నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ గుంతలో పడి మూడేళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. నీటితో నిండిన గుంతలో ప్రమాదవశాత్తు పడటంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన నరేష్ కుమార్ కుటుంబం జీవనోపాధి కోసం ఏడాది క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చింది. భార్య గంగమ్మ, కుమార్తె విద్యాశ్రీ (3), కుమారుడు విష్ణు (2)తో కలిసి నివసిస్తున్నారు. సుమారు పది నెలల క్రితం మొయినాబాద్‌లోని సురభి వెంచర్లో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద నరసింహ మేస్త్రి దగ్గర పని కుదరడంతో భార్యాభర్తలు అక్కడే పనులు చేసుకుంటూ ఉంటున్నారు.
ఈ క్రమంలో నవంబర్ 28న ఉదయం దంపతులు నిర్మాణ పనుల్లో ఉండగా.. అనారోగ్యంతో నరేష్ మధ్యాహ్నం ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. సాయంత్రం కుమార్తె కనిపించడం లేదని గంగమ్మ చెప్పడంతో ఇద్దరూ పరిసరాల్లో వెతికారు. చివరకు భవనంలో లిఫ్ట్ కోసం తవ్విన నీటితో నిండిన గుంతలో విద్యాశ్రీ మృతదేహాన్ని గుర్తించారు. తమ్ముడు విష్ణుతో కలిసి కింద అంతస్తులో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు గుంతలో పడినట్లు గుర్తించారు. ఘటనపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
