గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక మీ ట్రిప్ ప్లాన్ మొత్తం AIనే రెడీ చేస్తుంది!

గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక మీ ట్రిప్ ప్లాన్ మొత్తం AIనే రెడీ చేస్తుంది!

ఎక్కడికైనా టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే ముందుగా ఎక్కడికి వెళ్లాలి ? ఏయే ప్రదేశాలు చూడాలి ? ఎక్కడ భోజనం చేయాలి ? ఎంత బడ్జెట్ అవుతుంది ? ఇలా ఎన్నో విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఈ ప్లానింగ్‌కే చాలా సమయం పట్టేస్తుంది. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా ఏఐ ట్రిప్ ప్లానింగ్ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.

ప్రయాణికుల కోసం గూగుల్  'ఆస్క్ మ్యాప్స్' (Ask Maps) ఫీచర్‌కు కొత్త టూల్స్‌ను తీసుకొచ్చింది. వీటి సాయంతో మనం వెళ్లాలనుకునే ప్రదేశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, రోజు  జర్నీ ప్లాన్స్ కూడా ఏఐ రెడీ చేస్తుంది. అంతేకాదు.. ట్రాఫిక్, వాతావరణం, రెస్టారెంట్ల టైమింగ్స్ వంటి లైవ్ అప్‌డేట్స్‌ను కూడా ఇస్తుంది. లాంగ్ టూర్ల నుంచి వన్ డే  విహారయాత్రల వరకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

మీ ట్రిప్ ప్లాన్ మొత్తం ఏఐతోనే 
ఇప్పటివరకు మనం టూర్‌కు వెళ్లాలంటే గూగుల్‌లో వెతకడం, యూట్యూబ్‌లో వీడియోలు చూడటం, ఒక్కో ప్రదేశం గురించి తెలుసుకోవడం చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆస్క్ మ్యాప్స్ ద్వారా ఒకే చోట ట్రిప్‌కు సంబంధించిన ప్లాన్‌ను రెడీ చేసుకోవచ్చు. మీరు వెళ్లాలనుకుంటున్న ప్రదేశం గురించి అడిగితే, ఏయే ప్రాంతాలు చూడాలి ? ఏ రోజు ఎక్కడికి వెళ్లాలి ? అనే వివరాలతో డైలీ షెడ్యూల్‌ను రూపొందిస్తుంది.

ప్రతి ప్రదేశానికి సంబంధించిన వివరాలు, మ్యాప్‌లో నంబర్లతో కూడిన పిన్‌లను కూడా చూపిస్తుంది. దీంతో ఏ ప్రదేశం తర్వాత ఎక్కడికి వెళ్లాలనే విషయం ఈజీగా  అర్థమవుతుంది. అంతేకాదు, ఈ ట్రిప్ ప్లాన్‌ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. కావాలంటే గూగుల్ డాక్స్‌లోకి కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా రెస్టారెంట్‌లో భోజనం చేయాలనుకున్నా, మరో ప్రదేశాన్నిచూడాలనుకున్నా మ్యాప్స్‌ను అడిగి మీ ప్రయాణ షెడ్యూల్‌ను మార్చుకోవచ్చు. నచ్చిన ప్రదేశంపై క్లిక్ చేస్తే అక్కడికి వెళ్లేందుకు నావిగేషన్ కూడా అందిస్తుంది.

ట్రాఫిక్, వాతావరణం.. అన్నీ లైవ్ అప్‌డేట్స్!
జర్నీ మొదలుపెట్టే ముందు రోడ్డుపై ట్రాఫిక్ ఎలా ఉంది ? ఎక్కడైనా రద్దీ ఉందా ? వెళ్లే ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది ? అనే విషయాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు.. వెళ్లే దారిలో టోల్ ప్లాజాలు ఎక్కడ ఉన్నాయి ? కారును ఎక్కడ పార్క్ చేయాలి ? వంటి వివరాలను కూడా పొందవచ్చు. రెస్టారెంట్లు, షాపుల టైమింగ్స్  వంటి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీంతో ప్రయాణంలో అనవసరమైన ఇబ్బందులు తగ్గుతాయి.

అపాయింట్‌మెంట్లు కూడా బుక్ చేసుకోవచ్చు!
ఆస్క్ మ్యాప్స్‌లో మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను కూడా గూగుల్ తీసుకొస్తోంది. ఇకపై బ్యూటీ పార్లర్లు, పెట్ కేర్ సెంటర్లు, కార్ సర్వీసింగ్, ఇంటి రిపేర్లు  వంటి సేవలకు అపాయింట్‌మెంట్లు వెతుక్కోవచ్చు. మనకు దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్లలో ఏయే సమయాల్లో ఖాళీగా ఉన్న స్లాట్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. వాటికి అనుగుణంగా మన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో ఒక్కో సంస్థకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.

స్నేహితులతో కలిసి ప్రదేశాలను వెతుక్కోవచ్చు!
గూగుల్ మ్యాప్స్‌లో ఇప్పటికే మనకు నచ్చిన హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిస్ట్ స్పాట్స్‌ను సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ లిస్టులను వెతకడం మరింత సులభం కానుంది.

ఉదాహరణకు.. మీ లిస్టులో సేవ్ చేసుకున్న ప్రదేశాల్లో రాబోయే 30 నిమిషాల్లో ఐదుగురు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న రెస్టారెంట్లు ఏవని అడిగితే, మ్యాప్స్ వాటి లైవ్ లభ్యతను పరిశీలించి వివరాలు అందిస్తుంది. దీంతో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికి వెళ్లాలో త్వరగా నిర్ణయించుకోవచ్చు.

ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
గూగుల్ ఈ కొత్త ఫీచర్లను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. ట్రిప్ ప్లానింగ్, సేవ్ చేసుకున్న ప్రదేశాలను వెతికే ఫీచర్లు ఆస్క్ మ్యాప్స్ అందుబాటులో ఉన్న 200కు పైగా దేశాల్లో విడుదలవుతున్నాయి. అలాగే స్పెయిన్, యూకే, జర్మనీ సహా యూరప్‌లోని 30 దేశాలకు కూడా ఈ అప్‌డేట్‌ను విస్తరిస్తోంది.

ALSO READ : డేటా సెంటర్లకు హైదరాబాద్ అడ్డా! దేశంలోనే రెండో స్థానం

అయితే ప్రయాణానికి ముందు తెలుసుకోవాల్సిన చిట్కాలు, అపాయింట్‌మెంట్లు వెతికే ఫీచర్లను తొలుత అమెరికాలో అందుబాటులోకి తీసుకొస్తోంది.  దింతో ఇకపై టూర్ ప్లాన్ చేసుకోవడానికి గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేకుండా గూగుల్ మ్యాప్స్‌లోనే చాలా పనులు చేసుకునే అవకాశం రానుంది. ప్రయాణికులకు ఈ కొత్త ఏఐ ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.