కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు గళమెత్తారు. పార్లమెంటు వేదికగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను వినిపించడంతో పాటు, కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటాన్ని కొనసాగించిన నేతలు స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
పార్లమెంటులో గళమెత్తిన ఎంపీలు..
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. స్వరాష్ట్రం కోసం మన ఎంపీలు గళమెత్తారు. హైకమాండ్ కు స్వరాష్ట్ర ఆకాంక్షను వివరించారు. తెలంగాణ బిల్లు కోసం పార్లమెంటు వేదికగా తెగించి కొట్లాడిన వారిలో అప్పటి ఎంపీలు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధుయాష్కీ, బలరామ్ నాయక్, సిరిసిల్ల రాజయ్య కీలక పాత్ర పోషించారు.
►ALSO READ | త్యాగాల తెలంగాణలో భోగాలు వీళ్లకేనా?..కోట్లకు పడగలెత్తిన్రు
స్వరాష్ట్రమే లక్ష్యంగా ఎమ్మెల్యేల ఫోరం
వనపర్తి మాజీ ఎమ్మెల్యే జీ చిన్నారెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేల ఫోరం అధ్యక్షుడిగా స్వరాష్ట్ర గళం వినిపించారు. టీఆఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచే 41 మంది ఎమ్మెల్యేలతో ఫోరాన్ని ఏర్పాటు చేసి స్వరాష్ట్ర ఆకాంక్షలను కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలియజెప్పారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దీక్ష చేపట్టారు. 2011 నవంబర్ 1న ఆయన నల్లగొండలో ఈ ఆమరణ దీక్షను ప్రారంభించారు. వీరితో పాటు యాదవరెడ్డి, కత్తి వెంకటస్వామి ఇటు ఉద్యమంలో, అటు ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడంలో కీలకంగా పనిచేశారు.
