తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమిస్తే.. అధికారం మాత్రం కొందరు కుటుంబాల చుట్టూనే తిరిగిందనే చర్చ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పదవులు దక్కగా.. ఆస్తులు అమ్ముకొని పోరాడిన ఎంతోమంది ఉద్యమకారులు మాత్రం కాలక్రమంలో కనుమరుగయ్యారు. తెలంగాణ వచ్చాక ఎవరికి మేలు జరిగింది? ఉద్యమ త్యాగాలకు తగిన గుర్తింపు దక్కిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమయ్యాయి.
మలిదశ ఉద్యమంలో ముందుగా వినిపించే పేరు కేసీఆర్. టీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక ఇచ్చిన ఆయన రాష్ట్ర సాధన తర్వాత మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉద్యమనాయకుడిగా మొదటి ప్రయోజనాన్ని దక్కించుకున్నారు. ఆయన ప్రభుత్వంలో ఆయన కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు కీలక శాఖల మంత్రులయ్యారు. ఆయన బిడ్డ కవిత ఎంపీ అయ్యారు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలోనూ వీరే కీలకంగా ఉన్నారు. కేసీఆర్ బంధువు బోయినపల్లి వినోద్‌రావు ఎంపీ అయితే, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, తర్వాత ఆయన కొడుకు ఎమ్మెల్యేలు అయ్యారు. మరో బంధువు సంతోష్‌రావు రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేసీఆర్ రెండో టర్మ్ లోనూ కేటీఆర్, హరీశ్ కీలకంగా ఉంటే ఎంపీగా ఓడిన కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఉద్యమంలో పనిచేసినందుకు కుటుంబీకులకు పదవులివ్వడం న్యాయమేనని టీఆర్ఎస్ నేతలు సమర్థించుకున్నారు. మరోవైపు అంతకంటే కీలకంగా పనిచేసిన ఉద్యమకారులు, ఇతర వర్గాల నేతలకు కనీస గౌరవం దక్కలేదు. ఆస్తులమ్మి ఎదురుపెట్టినవాళ్లు చాలామంది ఇప్పుడు ఆనవాలు లేకుండా కనుమరుగయ్యారు.
కోట్లకు పడగెత్తిండ్రు
రెండు కుటుంబాలకు చెందిన కొందరి ఆస్తులు భారీ స్థాయిలో పెరగడం సమాజంలో చర్చకు దారితీసింది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కేసీఆర్, ఆయన బంధువులు, సన్నిహితుల ఆస్తులు పెరిగిన తీరుపై అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగడాన్ని జనం గమనించారు. పలురూపాల్లో, పలు వేదికలపై తెలంగాణ వచ్చాక ఎవరికి మేలు జరిగిందన్న చర్చ మొదలైంది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోగొట్టుకొని నిలువనీడ లేకుండా పోయినవారు, రాజకీయ ఆకాంక్షలున్నా పవర్ గేమ్‌లో ఎదగలేకపోయినవాళ్ల గురించి ఆలోచన మొదలైంది. ఇంతమంది కష్టంతో ఇంత కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆ త్యాగాలకు, కష్టాలకు గౌరవం, గుర్తింపు దక్కాలని సమాజం కోరుకుంటోంది.
►ALSO READ | బహుజన కెరటాలకు గౌరవం ఏది.. పోరాటంలో ఓయూ..
