గుండెపోటు, స్ట్రోక్ వంటి ముప్పులు ఈ మధ్య అకస్మాత్తుగా వస్తున్నప్పటికీ గుండెపోటు రావడానికి ముందు కనీసం నాలుగు రకాల ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి శరీరంలో ఉంటుందని కొత్త అధ్యయనం తేల్చింది. అమెరికా, దక్షిణ కొరియాకు చెందిన 90 లక్షల మందిపై 2025లో ఈ పరిశోధన జరిగింది. బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం లేదా ధూమపానం వల్ల 99 శాతం గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని గుర్తించారు.
గుండెపోటు, స్ట్రోక్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ కేసుల్లో 93 శాతం మందికి ఈ సమస్యలు ముందే ఉన్నాయని జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన వ్యాసం తెలిపింది. ఆరోగ్యానికి ముప్పుగా మారే బీపీ వంటి అంశాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పుకోవచ్చని పరిశోధకులు సూచించారు.
సిస్టోలిక్ రక్తపోటును 5 mmHg మేర తగ్గించడం వల్ల స్ట్రోక్, గుండెపోటు ముప్పు 12 శాతం తగ్గుతుందని 51 క్లినికల్ ట్రయల్స్ విశ్లేషణలో తేలింది. 3.5 లక్షల మందిపై చేసిన ఈ పరిశోధనలో చికిత్స మొదలుపెట్టిన మొదటి ఏడాదిలోనే ఫలితాలు కనిపించాయి. బీపీ కోసం వాడే ఐదు రకాల ప్రధాన మందులు ఈ ఫలితాలను ఇస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
హైపర్ టెన్షన్ థెరపీ వల్ల ప్రారంభంలోనే మెరుగైన ఫలితాలు వస్తాయని, అవి కాలక్రమేణా కొనసాగుతాయని పరిశోధనలో వెల్లడైంది. గుండె సంబంధిత సమస్యల నివారణలో, చికిత్సలో ఈ వివరాలు కీలకంగా మారుతాయని అధ్యయన రచయితలు చెప్పారు.
చెడు కొలెస్ట్రాల్‌ను ఒక యూనిట్ (mmol/l) మేర తగ్గిస్తే గుండె జబ్బుల ముప్పు 50 శాతం కంటే ఎక్కువగా తగ్గుతుందని 2022 నాటి విశ్లేషణ తెలిపింది. స్టాటిన్ మందులు వాడేవారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం 30 శాతం తక్కువగా ఉన్నట్లు ఆస్ట్రేలియాలో 10 వేల మందిపై జరిగిన అధ్యయనం వెల్లడించింది.
ALSO READ : Health tips:పాలు, పెరుగు, పనీర్.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? డైటీషియన్ల సలహా ఇదే
టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు షుగర్ నియంత్రణకు వాడే మందుల వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 22 శాతం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. జీఎల్పీ-1 రకానికి చెందిన ఈ మందులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌ను ఎంత త్వరగా నియంత్రణలోకి తెచ్చుకుంటే గుండెకు అంత రక్షణ లభిస్తుందని అధ్యయనం వివరించింది.
ధూమపానం మానేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పదేళ్ల పాటు సిగరెట్లకు దూరంగా ఉంటే సాధారణ వ్యక్తితో సమానంగా జీవించే అవకాశం ఉంటుందని వెల్లడైంది. 75 ఏళ్ల వయసులో ధూమపానం మానేసినా ఆరోగ్య ఫలితాలు మెరుగుపడతాయని నిపుణులు తెలిపారు.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ మాజీ ప్రెసిడెంట్ ఎడ్వర్డ్ ఫ్రై మాట్లాడుతూ.. అనారోగ్యం పెరిగిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని చెప్పారు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వంటి అంశాలను 10 శాతం మేర నియంత్రించగలిగితే మహిళల్లో గుండె జబ్బుల ముప్పు 23 శాతం వరకు తగ్గుతుందని కార్డియాలజిస్ట్ కరెన్ జాయింట్ మాడాక్స్ తెలిపారు.
