డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తున్న ఎన్డీయే సర్కార్ నెక్ట్స్ టార్గెట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ను ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
పార్లమెంట్లో త్వరలో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత జమిలి ఎన్నికల అంశం ప్రభుత్వ ఎజెండాలో అగ్రస్థానానికి చేరుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు కథనం పేర్కొంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను కూడా ప్రవేశపెడతారా అనే ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు ఐదు డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటయ్యాయి. 1952లో తొలి కమిషన్ ఏర్పడగా, 1963, 1973, 2002 సంవత్సరాల్లో తదుపరి కమిషన్లు పనిచేశాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో చేపట్టిన పునర్విభజనలో లోక్‌సభ స్థానాలు 522 నుంచి 543కి పెరిగాయి. 2002లో ఏర్పాటైన కమిషన్ లోక్‌సభ స్థానాల సంఖ్యను మార్చకపోయినా, అసెంబ్లీ స్థానాలను 3,997 నుంచి 4,123కి పెంచింది. ఈ కమిషన్ నివేదిక సమర్పించడానికి ఐదేళ్లు పట్టింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో 2022లో, అసోంలో 2023లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ ప్రక్రియలపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొత్త డీలిమిటేషన్ కమిషన్ రెండేళ్లలో నివేదిక సమర్పించగలదా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
ALSO READ : డీలిమిటేషన్‌పై డీఎంకే మద్దతు.. అన్నామలై సంచలన కామెంట్స్
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిషన్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రతినిధి, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన పది మంది అసోసియేట్ సభ్యులకు సలహా ఇచ్చే పాత్ర మాత్రమే ఉంటుంది. నివేదికపై వారికి ఓటు హక్కు ఉండదు. మరోవైపు, డీలిమిటేషన్ కమిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేయలేని నిబంధన కూడా చర్చనీయాంశంగా ఉంది. మొత్తంగా 2029 ఎన్నికల నాటికి డీలిమిటేషన్, జమిలి ఎన్నికల ప్రక్రియలను అమలు చేయడం కేంద్రం ముందున్న ప్రధాన సవాలుగా కనిపిస్తోంది.
