కట్నంగా కారు కావాలా? ఇదిగో తీసుకోండి! వరుడి కుటుంబానికి వధువు ఫ్యామిలీ షాక్!

కట్నంగా కారు కావాలా? ఇదిగో తీసుకోండి! వరుడి కుటుంబానికి వధువు ఫ్యామిలీ షాక్!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కట్నం కోసం ఆశపడిన వరుడి కుటుంబానికి వధువు బంధువులు ఊహించని షాక్ ఇచ్చారు. పెళ్లికి ముందే మహీంద్రా థార్ కారు కావాలని డిమాండ్ చేయడంతో, వారికి బుద్ధి చెప్పేలా బొమ్మ కారును బహుమతిగా ఇచ్చి పెళ్లిని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరట్‌లోని సోలానా గ్రామానికి చెందిన యువతికి, జ్ఞాన్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది.

పెళ్లికి సంబంధించిన సంప్రదాయ కార్యక్రమంలో భాగంగా వరుడి కుటుంబ సభ్యులు వధువు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా వరుడి తండ్రి షంషేరే తమకు కట్నంగా మహీంద్రా థార్ ఎస్‌యూవీ కావాలని డిమాండ్ చేశాడు. వరుడి కుటుంబం చేసిన ఈ డిమాండ్‌తో వధువు బంధువులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అయితే, అక్కడికక్కడే గొడవ పడకుండా వారికి మర్యాదలు చేసి రోజంతా ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం వరుడి బంధువులు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో అసలు ట్విస్ట్ ఇచ్చారు.

వారు అడిగిన మహీంద్రా థార్‌కు బదులుగా ఓ బొమ్మ కారును తీసుకొచ్చి వరుడి కుటుంబానికి అందించారు. నిజమైన కారు వస్తుందని ఆశించిన వారికి బొమ్మ కారు కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ పరిణామంతో వరుడి కుటుంబం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. అంతటితో ఆగకుండా కట్నం కోసం డిమాండ్ చేసిన వరుడి కుటుంబంతో సంబంధం కొనసాగించకూడదని వధువు కుటుంబం నిర్ణయించుకుంది. వెంటనే పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. కట్నం కోసం అమ్మాయిల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టే కుటుంబాలకు ఈ ఘటన ఒక గుణపాఠమని నెటిజన్లు వధువు కుటుంబం చేసిన పనిని సమర్థించారు.