యూపీ వ్యాపారవేత్త మృతి కేసులో ట్విస్ట్.. సీసీటీవీకి చిక్కిన శ్రద్ధా దుబే ? రూ.25 వేల రివార్డు ప్రకటన..

యూపీ వ్యాపారవేత్త మృతి కేసులో ట్విస్ట్.. సీసీటీవీకి చిక్కిన శ్రద్ధా దుబే ?  రూ.25 వేల రివార్డు ప్రకటన..

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త శివ శర్మ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్ధా దుబే కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఆమె నేపాల్‌కు పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కదలికలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

శివ శర్మ మృతి తర్వాత శ్రద్ధా దుబే, ఆమె సోదరి రష్మి, మరో నిందితుడు ఆదిల్ ఎక్కడికి వెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా... ఈ ముగ్గురూ కలిసే ఉన్నట్లు చెబుతున్న ఫొటోలు, సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

వీరిని చివరిసారిగా నేపాల్‌లోని మహిమ్ నగర్‌లో చూసినట్లు.. అక్కడ వారు రోడ్డు దాటి బస్ స్టేషన్‌లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది.

పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వారు రాత్రంతా బస్ స్టేషన్ ప్రాంగణంలో ఉండి, మరుసటి రోజు ఉదయం బస్సులో వెళ్లిపోయినట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. అయితే, సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తున్నది శ్రద్ధా దుబేనేనా అనే విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

28 ఏళ్ల శివ శర్మ వ్యాపారవేత్తగా, రెస్టారెంట్ యజమానిగా ఉన్నారు. అక్టోబర్ 9న లక్నోలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందపడి ఆయన మరణించారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని, శ్రద్ధా దుబేతో పాటు మరికొందరికి ఇందులో సంబంధం ఉందని శివ శర్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను శ్రద్ధా దుబే ఖండించారు.

శివ శర్మ మరణించిన వెంటనే శ్రద్ధా దుబే లక్నో నుంచి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తులో అక్టోబర్ 10న మరో కీలక ఆధారం లభించింది. బహ్రాయిచ్ జిల్లాలోని రూపైదిహాలో ఓ ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో శ్రద్ధాకు చెందినదిగా భావిస్తున్న స్కార్పియో ఎస్‌యూవీని పోలీసులు గుర్తించారు. ఆ వాహనానికి UP 32 QQ 0111 నంబర్ ఉంది.

ఈ ప్రాంతం భారత్‌-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, వాహనాన్ని అక్కడే వదిలేసి నిందితులు నేపాల్‌లోకి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

►ALSO READ | ప్రియురాలిని లోయలోకి తోసేసి.. కట్టుకథలు అల్లిన ప్రియుడు.. ఎలా దొరికాడంటే

శ్రద్ధా దుబే, ఆమె సోదరి రష్మి, మరో నిందితుడి కోసం పోలీసులు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఫొటోలు, ఇతర ఆధారాల ఆధారంగా వారు ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రద్ధా దుబే ఆచూకీ తెలిపిన వారికి లక్నో పోలీసులు రూ.25 వేల రివార్డు కూడా  ప్రకటించారు.

మరోవైపు, పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలోనే శ్రద్ధా దుబే సోషల్ మీడియాలో పలు వీడియోలు పోస్ట్ చేసింది. శివ శర్మ ఆత్మహత్య చేసుకుని మరణించారని ఆమె పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండా తనను రాజకీయ నాయకులు, అధికారులు లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులతో ముడిపెట్టవద్దని కోరింది. అయితే, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.